Mamata Banerjee: నాపై తప్పుడు కేసులు పెట్టేందుకు కుట్ర.. బీజేపీపై మమతా బెనర్జీ ఆరోపణలు
ఈ వార్తాకథనం ఏంటి
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. వానీపుర్ నుంచి తన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయించేందుకు భారతీయ జనతా పార్టీ (భాజపా) ప్రయత్నించిందని ఆమె పేర్కొన్నారు. తనపై తప్పుడు కేసులు నమోదు చేయించేందుకు ఆ పార్టీ నేతలు ఎన్నికల సంఘంతో కలిసి కుట్ర పన్నారని ఆరోపించారు. అయితే తమ పార్టీ నేతలు ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారని వెల్లడించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పోటీ చేసి గెలిచే ధైర్యం లేకపోవడంతో బీజేపీ మోసపూరిత మార్గాల్లో ఓట్లు దక్కించుకోవాలని చూస్తోందని మమత విమర్శించారు. ఈ క్రమంలోనే 'సర్' పేరుతో వేల సంఖ్యలో ఓటర్ల పేర్లను తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివరాలు
ఎన్నికల సంఘంతో కలిసి బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది
మొత్తం 90 లక్షల మంది ఓటర్ల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారని ఆరోపించారు. ఎన్నికల ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఈవీఎంలలో అవకతవకలకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇందులో ఎన్నికల సంఘంతో కలిసి బీజేపీ ప్రణాళికలు రచిస్తోందని ఆమె ఆరోపించారు. అలాగే రాష్ట్ర ప్రజల ప్రజాస్వామ్య హక్కులను హరించడానికే బెంగాల్‌లో యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ)ను అమలు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని మమత పేర్కొన్నారు. ఇది వెనుకబడిన వర్గాలకు వ్యతిరేకమని ఆమె అన్నారు. బెంగాల్‌లో యూసీసీ అమలు జరగనివ్వమని స్పష్టం చేశారు.