Aparajita Bill 2024: బెంగాల్ లో 'అపరాజిత' బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం..ఈ బిల్ చరిత్రాత్మకం
పశ్చిమ బెంగాల్‌లో జరిగిన జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన రాష్ట్రంలో తీవ్ర చర్చలకు దారితీసింది. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో, బెంగాల్ ప్రభుత్వం అసెంబ్లీలో హత్యాచార నిరోధక బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లు "అపరాజిత విమెన్ అండ్ చైల్డ్ బిల్లు" పేరుతో ప్రవేశ పెట్టబడింది. ప్రత్యేక సెషన్ నిర్వహించి, చర్చల అనంతరం బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.
బిల్లు చరిత్రాత్మకం అన్న సీఎం పేర్కొన్నారు
మొత్తం పశ్చిమ బెంగాల్ తరపున అపరాజిత బిల్లును స్వాగతిస్తున్నానని సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఈ బిల్లును చారిత్రాత్మకమైనదిగా అభివర్ణిస్తూ, 1981 సెప్టెంబర్ 3న ఐక్యరాజ్యసమితి మహిళలపై అఘాయిత్యాలపై చర్య తీసుకుందని, మహిళలపై వివక్షపై సదస్సును ప్రారంభించిందని చెప్పారు. చారిత్రాత్మకమైన ఈ రోజున ఈ బిల్లును అందరూ ఆమోదించడాన్ని నేను స్వాగతిస్తున్నానని సీఎం అన్నారు. ఇంతటి ఘోరమైన నేరాలకు గురై మరణించిన బాధితురాలికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని ఆమె అన్నారు. కోల్‌కతా రేప్ హత్య కేసుకు సంబంధించి మమతా బెనర్జీ మాట్లాడుతూ, అత్యాచారానికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది తీవ్రమైన నేరం. మహిళలను గౌరవించని సమాజం ఉండదని ఆమె అన్నారు.
రాష్ట్రంలో 88 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు
బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం సీఎం మమతా బెనర్జీ ప్రతిపక్ష పార్టీ బీజేపీని ఉద్దేశించి,బీజేపీ గవర్నర్ సి.వి.ఆనంద్ బోస్‌ని ఈ బిల్లును వెంటనే ఆమోదించమని కోరండి. అలాగే 2013 నుంచి రాష్ట్రంలోని అన్ని ఫాస్ట్‌ట్రాక్ కోర్టులకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా నిలిపివేసిందన్నారు. రాష్ట్రంలో 88ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయని సీఎం చెప్పారు. కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్‌పై ఆగస్టు 9న జరిగిన అత్యాచారం కేసుకు సంబంధించి సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. బాధితురాలికి న్యాయం చేయాలని సీబీఐని కోరుతున్నామని చెప్పారు. అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నకోర్టులకు సంబంధించి బెంగాల్‌లో మహిళలకు ప్రత్యేక కోర్టు ఉందని, ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉందని,ఇందులో 7000 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు.
బిల్లుకు మద్దతు ఇచ్చిన విపక్షాలు
రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును వేగంగా విచారిస్తున్నప్పటికీ కోర్టు నుంచి న్యాయం జరగడంలో జాప్యం జరుగుతోందన్నారు. కోల్‌కతా అత్యాచార ఘటనపై ప్రధాని నుంచి ఎలాంటి స్పందన రాలేదని సీఎం మమతా బెనర్జీ అన్నారు. బీజేపీని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్‌లో రైళ్లలో అత్యాచారం వంటి నేరాలు జరుగుతాయని బీజేపీ చెబుతోంది..కాబట్టి పశ్చిమ బెంగాల్‌లో రైళ్లలో అత్యాచారాలు జరిగితే,పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని నియంత్రించేది ఎవరు? ఉన్నావ్, హత్రాస్ గురించి బీజేపీ ఎందుకు మాట్లాడదని అన్నారు. ఆమె యూపీ, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న నేరాలపై మాట్లాడి, బెంగాల్‌లో మహిళలకు కోర్టుల్లో న్యాయం లభిస్తుందని తెలిపారు. హత్యాచార ఘటనపై మమత ప్రభుత్వాన్ని విపక్షాలు తీవ్రంగా విమర్శించినప్పటికీ, బిల్లుకు మద్దతు ఇవ్వడం గమనార్హం.