Mamata Banerjee: భవానీపుర్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన మమతా బెనర్జీ..
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గమైన భవానీపుర్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. తన జీవితంలో అంతా ఇక్కడినుంచే మొదలైందని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు. నామినేషన్ దాఖలు చేసేముందు ఖాళీఘాట్‌లోని తన నివాసం నుంచి అలీపుర్ సర్వే భవనం వరకు ఆమె భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆమె అనుచరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.అనంతరం ఆమె అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. తర్వాత మీడియాతో మాట్లాడిన ఆమె,తాను పుట్టి పెరిగింది భవానీపుర్‌లోనే అని,తన రాజకీయ ప్రయాణం కూడా ఇక్కడినుంచే మొదలైందని గుర్తుచేసుకున్నారు. రాష్ట్రంలోని మొత్తం 294స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.
వివరాలు
ఓటరు జాబితాపై ఆందోళన
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా పలువురి పేర్లు తొలగించడంపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల పేర్లు తొలగించడం బాధాకరమని, ఇంకా తుది జాబితా విడుదల కాకపోవడం అర్థంకావడం లేదని అన్నారు. ఈ విషయంపై మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. భవానీపుర్ నుంచి మమతా బెనర్జీ ఇప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ నియోజకవర్గం ఆమెకు బలమైన కోటగా భావిస్తారు. అయితే, ఈసారి భారతీయ జనతా పార్టీ తరఫున సువేందు అధికారి పోటీకి దిగుతున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23 మరియు 29 తేదీల్లో రెండు విడతలుగా జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.