Mamata Banerjee : మహువా మోయిత్రా కేసులో మౌనం వీడిన దీదీ.. ఏమన్నారంటే
ప్రశ్నకు నగదు కేసులో మహువా మోయిత్రా పాత్రపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎట్టకేలకు స్పందించారు. ఈ మేరకు లోక్‌సభ నుంచి టీఎంసీ ఎంపీ మహువాను తప్పించేందుకు కేంద్రం పక్కా ప్లాన్ చేసిందని మమతా ఆరోపణలు గుప్పించారు. గత కొంత కాలంగా ఈ అంశంపై పార్లమెంటులో రగడ నెలకొంది. అటు దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో కలకలం రేగింది. ఈ మేరకు ఈ కేసుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తొలిసారిగా మౌనం వీడారు. ఎంపీ మహువా మొయిత్రాను కావాలనే లక్ష్యంగా చేసుకున్నారని మమతా బెనర్జీ అన్నారు. ముందస్తు సిద్ధం చేసుకున్న ప్లాన్ ప్రకారమే తమ పార్టీకి చెందిన ఎంపీ మహువాను తప్పించాలని చూస్తున్నారని దీదీ చెప్పుకొచ్చారు.
మహువాకే కలిసొస్తుంది : సీఎం మమతా బెనర్జీ
అయితేె 2024లో జరగనున్న సాధారణ ఎన్నికల ముందు జరిగిన ఈ సంఘటన ఆమెకు కలిసి వస్తుందన్నారు. క్యాష్ ఫర్ క్వైరీ (Cash For Query) కేసులో మహవా మోయిత్రాను లోక్‌సభ సభ్యత్వం నుంచి తప్పించేందుకు ఎథిక్స్ కమిటీ ఇప్పటికే చర్యలు చేపట్టింది. ప్రశలు వేసేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందని నుంచి రూ. రెండు కోట్లు, ఖరీదైన గిఫ్ట్ ఐటమ్స్ తీసుకున్నట్లు మహువాపై ఆరోపణలు వెల్లువెత్తాయి. భారత్ ప్రభుత్వపై ప్రశ్నలు వేసేందుకు మహువా డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ఈ కేసులో ఎంపీ మహువాను పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ విచారణ సైతం చేపట్టింది. దీంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మోయిత్రా ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.