Mamunur Airport: మామునూరు ఎయిర్‌పోర్ట్ విస్తరణ.. భూసేకరణపై రైతులు ఆందోళన
ఈ వార్తాకథనం ఏంటి
వరంగల్ జిల్లాలో మామునూరు ఎయిర్ పోర్ట్ విస్తరణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణ సర్వేను రైతులు అడ్డుకున్నారు.
ఎయిర్ పోర్ట్ కోసం తమ భూములను కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. భూముల మళ్లింపు ప్రక్రియలో సక్రమ పరిహారం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ, నక్కలపల్లి రోడ్డు తొలగించొద్దని గుంటూరు పల్లి రైతులు అభ్యర్థించారు.
తమ గ్రామానికి సరైన రోడ్డు మార్గం చూపించాలని వారు ఆందోళనకు దిగారు.
ఈ నిరసన కార్యక్రమంలో మహిళలు భారీగా పాల్గొన్నారు. సర్వే నిర్వహించేందుకు వచ్చిన ఆర్డీవోను అడ్డుకుని, ఇప్పుడే సర్వే చేయొద్దని గుంటూరు పల్లి వాసులు విజ్ఞప్తి చేశారు.
దీంతో నిరసన చోటుచేసుకున్న ప్రదేశంలో పోలీసులు భారీగా మోహరించారు.
Details
విమానాశ్రాయం రావడం ఆనందకరమే
రైతులు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. విమానాశ్రయం రావడం ఆనందకరమే అయినప్పటికీ, అది తమకు నష్టంగా మారకూడదని ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు న్యాయం చేయాలని అనేక మార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా సరైన స్పందన లేకపోవడంతో ఆందోళనకు దిగినట్లు తెలిపారు.
మార్కెట్ విలువకు తగ్గ నష్టపరిహారం అందించడంతో పాటు, రైతులు కోరిన ప్రదేశంలో వ్యవసాయానికి అనువైన భూములను కేటాయిస్తామని ప్రభుత్వం పేర్కొంది.
భూములకు భూమి ఇవ్వకపోవడమే కాకుండా తమ గ్రామానికి వెళ్లే రహదారిని మూసివేయడం తగదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.