LOADING...
Rameshwaram Cafe: రామేశ్వరం కేఫ్‌ పొంగల్‌లో పురుగు.. ఫేక్ వీడియోతో 25 లక్షలు కొట్టేసే ప్లాన్!
రామేశ్వరం కేఫ్‌ పొంగల్‌లో పురుగు.. ఫేక్ వీడియోతో 25 లక్షలు కొట్టేసే ప్లాన్!

Rameshwaram Cafe: రామేశ్వరం కేఫ్‌ పొంగల్‌లో పురుగు.. ఫేక్ వీడియోతో 25 లక్షలు కొట్టేసే ప్లాన్!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 25, 2025
09:09 am

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ హోటల్‌ "రామేశ్వరం కేఫ్‌" తాజా వివాదంలో సంచలన మలుపు తిరిగింది. ఈ కేఫ్‌లో పొంగల్‌లో పురుగు కనిపించినట్లు సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం సాగుతున్న సమయంలో, హోటల్ యజమానులు రాఘవేంద్రరావు,ఆయన భార్య దివ్యా రాఘవేంద్రరావు ఈ ఘటన వెనుక కుట్ర ఉందని నోటు ద్వారా వెల్లడించారు. తమ హోటల్‌ పేరును బద్నాం చేసి, రూ. 25 లక్షలు డిమాండ్ చేయాలనే కుట్ర పన్నారని ఆధారాల్ని బయట పెట్టారు.

వివరాలు 

కేఫ్‌ సిబ్బంది సరిగా స్పందించలేదు: కస్టమర్  

బెంగళూరులోని కెంపేగౌడ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ఉన్న రామేశ్వరం కేఫ్‌ లో ఓ కస్టమర్‌ బ్రేక్‌ఫాస్ట్‌గా పొంగల్‌ ఆర్డర్‌ చేశారు. ఆహారం తినే క్రమంలో ఆయన పొంగల్‌లో పురుగు ఉందని గుర్తించి, వెంటనే స్టాఫ్‌కు సమాచారం అందించారు. అయితే కేఫ్‌ సిబ్బంది సరిగా స్పందించలేదని కస్టమర్‌ ఆరోపించారు. ఆగ్రహంతో ఉన్న ఆ కస్టమర్‌ ఈ విషయాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో పొంగల్‌లో పురుగు ఉందని స్పష్టంగా చూపిస్తూ, "ఇలాంటి పరిస్థితుల్లో కేఫ్‌ యాజమాన్యాన్ని ఎలా సంప్రదించాలి?" అంటూ చర్చించారు. వీడియో వైరల్‌ అయిన తర్వాత, కేఫ్‌ యాజమాన్యం స్పందించి ఆ కస్టమర్‌కు క్షమాపణలు చెప్పి, రూ. 300 రీఫండ్‌ చేశారు.

వివరాలు 

ఐదుగురు కస్టమర్ల పొంగల్‌ లో పురుగు

అయితే, విషయం అక్కడితో ముగియలేదు. రామేశ్వరం కేఫ్‌ యాజమాన్యం తాజా ట్వీట్‌ ద్వారా వివరణ ఇస్తూ, ఈ ఘటన పూర్తిగా పన్నిన స్కెచ్‌ అనే విషయాన్ని వెల్లడించింది. హోటల్‌ యాజమానుల ప్రకారం, ఆ రోజు ఐదుగురు కస్టమర్లు వచ్చి పొంగల్‌ లో పురుగు ఉందంటూ హంగామా చేశారు. వారు నష్టపరిహారం ఇవ్వాలని, లేకపోతే తీసిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టేస్తామని బెదిరించారని చెప్పారు. కస్టమర్‌ అభ్యర్థన మేరకు రూ.300 రీఫండ్‌ ఇచ్చిన తర్వాత వారు వెళ్లిపోయారు. అయితే, కొద్ది సేపటికే మళ్లీ ఫోన్‌ చేసి, "మీ కేఫ్‌కు ఉన్న పేరు ప్రతిష్ట దెబ్బతినకుండా ఉండాలంటే రూ. 25 లక్షలు ఇవ్వాలి. లేకపోతే వీడియో వైరల్ చేస్తాం" అని డిమాండ్‌ చేశారని వెల్లడించారు.

వివరాలు 

కస్టమర్లుగా వచ్చి అసత్య ఆరోపణలు

ఈ ఆరోపణలపై స్పందించిన యాజమాన్యం,తమ రెస్టారెంట్‌లో పరిశుభ్రమైన ఆహారాన్ని మాత్రమే అందిస్తున్నామని స్పష్టం చేసింది. "మేము ఎప్పటికీ ఆహారం విషయంలో రాజీపడం.ఇదంతా ఒక ప్లాన్‌లో భాగమే. ఈ కుట్రకు సంబంధించిన కాల్‌ రికార్డింగ్స్‌, సీసీటీవీ ఫుటేజీని మేము పోలీసులకు అప్పగించాం"అని తెలిపారు. అలాగే,తమపై వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని కోరారు. కస్టమర్లుగా వచ్చి అసత్య ఆరోపణలు చేసిన వారికి వ్యతిరేకంగా న్యాయపరంగా ఎదుర్కొనేందుకు చర్యలు ముమ్మరం చేసినట్లు చెప్పారు. ఇది కొత్త విషయం కాదని,గతంలో కూడా కొంతమంది కస్టమర్లు తమ భోజనాల్లో పురుగులు,ఈగలు, రాళ్లు ఉన్నాయని ఆరోపించారని,కానీ వాటిని అధికారులు పరిశీలించి అవన్నీ నిరాధారమని తేల్చారని యాజమాన్యం పేర్కొంది. ఇలాంటి నిరాధార ఆరోపణల వల్ల తమ పేరు,నమ్మకాన్ని నాశనం చేయాలని ప్రయత్నం జరుగుతుందన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రామేశ్వరం కేఫ్‌ చేసిన ట్వీట్