Odisha: అక్క అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన గిరిజనుడు.. ఒడిశాలో హృదయ విదారక ఘటన.. అసలేం జరిగిందంటే..!
ఈ వార్తాకథనం ఏంటి
ఒడిశాలోని కియోన్‌ఝర్ జిల్లాలో మానవత్వాన్ని తలదన్నేలా, నిబంధనలు ఓ నిరుపేద జీవితంతో ఎలా ఆడుకున్నాయో తెలిపే హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మరణించిన తన సోదరి ఖాతాలో ఉన్న రూ.19,300 తీసుకోవడానికి, ఆమె అస్థిపంజరాన్ని భుజాన మోసుకుంటూ సుమారు మూడు కిలోమీటర్లు నడిచి బ్యాంకుకు చేరుకున్నాడు. ఈ ఘటనను చూసిన గ్రామస్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. కియోన్‌ఝర్ జిల్లాలోని దియానాలి గ్రామానికి చెందిన జితు ముండా అనే గిరిజనుడి సోదరి కక్రా ముండా రెండు నెలల క్రితం మరణించింది. ఆమె భర్త, ఏకైక సంతానం ఇప్పటికే చనిపోవడంతో జితు ఒక్కడే ఆమెకు దగ్గరి బంధువుగా మిగిలాడు. కక్రా పేరుతో మల్లీపసిలో ఉన్న గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉండగా, అందులో రూ.19,300 ఉన్నాయి.
వివరాలు
స్మశానం నుంచి అస్థిపంజరాన్ని తీసి బ్యాంకుకు తరలింపు
ఆ డబ్బును తీసుకోవాలని జితు బ్యాంకును ఆశ్రయించగా, నిబంధనల కారణంగా అధికారులు అనుమతించలేదు. ఖాతాదారు స్వయంగా రావాలని లేదా చట్టబద్ధమైన వారసత్వ పత్రాలు, మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని సూచించారు. చదువు లేక, ఆర్థికంగా బలహీనుడైన జితుకు ఈ ప్రక్రియ అర్థం కాలేదు. పత్రాలు ఎలా తెచ్చుకోవాలో తెలియక, నిరాశతో వెనుదిరిగాడు. మరో మార్గం లేక సోమవారం గ్రామ స్మశానానికి వెళ్లిన జితు, అక్కడ తన సోదరిని సమాధి చేసిన ప్రదేశాన్ని తవ్వి, ఆమె అస్థికలను, అస్థిపంజరాన్ని ఒక బట్టలో చుట్టాడు. ఎండ మండుతున్న సమయంలో ఆ మూటను భుజాన వేసుకుని బ్యాంకుకు చేరుకున్నాడు. ఈ దృశ్యం చూసిన స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
వివరాలు
బ్యాంకు తీరుపై స్థానికుల తీవ్ర ఆగ్రహం.. పోలీసుల జోక్యం
కొందరు కన్నీళ్లు పెట్టుకోగా, మరికొందరు అధికారుల వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఒక పేదవాడు తన సొంత డబ్బు తీసుకోవడం ఇంత కష్టమా?" అంటూ ప్రశ్నించారు. గ్రామ పెద్దల సమక్షంలో విచారణ చేయకుండా, కేవలం పత్రాలకే ప్రాధాన్యం ఇచ్చి మానవత్వాన్ని విస్మరించారని విమర్శించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని జితును ఓదార్చారు. మానవతా దృక్పథంతో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఘటనపై బ్యాంకు అధికారుల నుంచి వివరణ కోరుతామని తెలిపారు.