
Bengaluru: గుంతలమయంగా బెంగళూరు రోడ్లు.. రూ.50లక్షలు డిమాండ్ చేస్తూ లీగల్ నోటీస్ పంపిన వ్యక్తి
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా టెక్నాలజీ కేంద్రంగా పేరుగాంచిన బెంగళూరు, ఒకప్పుడు సుందరంగా ఉన్న నగరంగా ప్రశంసలు పొందింది.
కానీ ఇప్పుడు ఆ మహానగరం కుక్కలు చింపేసిన విస్తరిలా తయారయింది.
నగరంలోని రహదారులన్నీలోతైన గుంతలు, వాటిలో నిలిచిన నీరు వాహనదారులకు తీవ్ర సమస్యలు కలిగిస్తున్నాయి.
ఈ రహదారి పరిస్థితుల వల్ల వాహనదారులు శారీరకంగా, మానసికంగా గాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో బెంగళూరులో నివసించే దివ్య కిరణ్ అనే వ్యక్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
రోడ్లపై ఉన్న నాణ్యతలేని పరిస్థితుల వల్ల తన ఆరోగ్యంలో తీవ్రమైన మార్పులు వచ్చాయని, శారీరిక, మానసిక బాధలు ఎదుర్కొంటున్నానని ఆయన వాపోయారు.
వివరాలు
ఆరోగ్య సమస్యలకు సంబంధించి తొమ్మిది ఆసుపత్రుల మెడికల్ స్టేట్‌మెంట్‌లు
మౌలిక సదుపాయాల కల్పనలో నగర పాలకులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దివ్య కిరణ్ బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ)కు రూ.50 లక్షల పరిహారం కోరుతూ లీగల్ నోటీసు పంపించారు.
ఈ నోటీసులో ఆయన తన ఆరోగ్య సమస్యలకు సంబంధించి తొమ్మిది ఆసుపత్రుల మెడికల్ స్టేట్‌మెంట్‌లను జత చేశారు.
రహదారిపై అసమానతల వల్ల వాహనం నడపలేని స్థితి ఏర్పడి,తీవ్రమైన ఒళ్ళు నొప్పులు వచ్చినట్టు తెలిపారు.
మెడ, వెన్నెముక నొప్పులతో బాధపడుతున్నానని చెప్పిన ఆయన, ఆర్థోపెడిక్ నిపుణులను ఐదు మార్లు కలిసినట్టు పేర్కొన్నారు.
అలాగే సెయింట్ ఫిలోమినా ఆసుపత్రికి నాలుగు సార్లు అత్యవసర సేవల కోసం వెళ్లినట్టు వివరించారు.
నొప్పుల నుండి ఉపశమనం పొందేందుకు ఇంజెక్షన్లు, ఇతర వైద్య చికిత్సలు తీసుకున్నట్టు తెలిపారు.
వివరాలు
ఈ దుస్థితికి ప్రజలే కారణం: పరమేశ్వర్
లీగల్ నోటీసులో రూ.50 లక్షల పరిహారంతో పాటు, తన లీగల్ ఖర్చుల కోసం రూ.10,000 కూడా చెల్లించాల్సిందిగా పేర్కొన్నారు.
దీనిపై స్పందన రాకపోతే, తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో వెనుకాడబోనని, అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తానని, లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని కూడా సంప్రదిస్తానని హెచ్చరించారు.
ఇక మరోవైపు, సోమవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి బెంగళూరు నగరం అతలాకుతలమైంది.
రహదారులన్నీ నీటితో నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు జలమయమయ్యాయి.
ప్రజలు సాధారణ రవాణా వదిలి పడవల్లో ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ వర్షపు కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ దుస్థితికి ప్రజలే కారణమంటూ రాష్ట్ర మంత్రి పరమేశ్వర్ వ్యాఖ్యానించారు.
రహదారులు నీటమునిగినట్లయితే దానికి కారణం ప్రజలే అని ఆరోపించారు.