Manipur Violence: మిజోరాం నుంచి మణిపూర్‌కు మైతీ ప్రజలు: ప్రత్యేక విమానాల ఏర్పాటు
మాజీ మిలిటెంట్ల సంస్థ Peace Accord MNF Returnees' Association (PAMRA) హెచ్చరిక నేపథ్యంలో మైతీ తెగకు చెందిన వారు మిజోరాం నుంచి మణిపూర్‌కు తరలివెళ్తున్నారు. మణిపూర్‌లోని మైతీ తెగకు చెందిన వారు ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డరన్న వార్త దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో మైతీ తెగపై మిజోరం జనాల్లో ఆగ్రహం పెరుగుతోందని పీఏఎంఆర్ఏ అనుమానం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మైతీ ప్రజలను మణిపూర్ తరలించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఐజ్వాల్ - ఇంఫాల్, ఐజ్వాల్ - సిల్చార్ మధ్య ప్రత్యేక ATR విమానాలను నడపనుందని ఇండియా టుడే రాసుకొచ్చింది. అలాగే మిజోరంలోని మైతీ ప్రజలకు భద్రత పెంచినట్లుగా ఇండియన్ ఎక్స్ ప్రెస్ రాసుకొచ్చింది.
మిజోరంలో మెయితీ ప్రజలకు భద్రత పెంపు
మిజోరాంలోని వెటీ కాలేజ్, మిజోరం యూనివర్సిటీల్లో మైతీ ప్రజలకు భద్రత పెంచినట్లు సమాచారం. మిజోరంలో మైతీ ప్రజలు నివసించడం సురక్షితం కాదని PAMRA హెచ్చరిస్తోంది. మరోపక్క పుకార్లను పట్టించుకోవద్దని, మైతీ తెగల ప్రజలకు రక్షణ కల్పిస్తామని మిజోరాం ప్రభుత్వం భరోసా ఇస్తోంది. మణిపూర్ అల్లర్లు: షెడ్యూల్డ్ హోదా(ఎస్టీ) డిమాండ్ కోసం మైతీ ప్రజలు మే 3న ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన తర్వాత జరిగిన హింసాకాండలో 160మందికి పైగా ప్రజలు మరణించారు. తాజాగా ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించారన్న వార్తతో మణిపూర్ అల్లర్ల అంశం వైరల్ గా మారింది.