Manmohan Singh : మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం
భారత దేశ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం అధికారికంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. గురువారం రాత్రి ఢిల్లీ ఎయిమ్స్ నుండి ఆయన పార్థివదేహాన్ని మోతిలాల్ నెహ్రు మార్గ్ 3 లోని అధికారిక నివాసానికి తరలించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు అనేక మంది కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్, కేంద్ర మంత్రులు మన్మోహన్ సింగ్ మరణం పట్ల తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
7 రోజులు సంతాప దినాలు
శుక్రవారం ఉదయం 11 గంటలకు కేంద్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి కేబినెట్ సంతాపం తెలపనుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 7 రోజులు సంతాప దినాలుగా ప్రకటించి, ఈ రోజు జరిగే అన్ని అధికారిక కార్యక్రమాలను రద్దు చేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా 7 రోజులు అన్ని పార్టీ కార్యక్రమాలను రద్దు చేసింది. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం ఈ రోజును సెలవుదినంగా ప్రకటించింది.