2025 నాటికి క్షయ వ్యాధి నిర్మూలనే భారత్ లక్ష్యం: ప్రధాని మోదీ
2025 నాటికి క్షయవ్యాధి (టీబీ)ని నిర్మూలించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని మోదీ అన్నారు. 'మన్ కీ బాత్'లో భాగంగా ఆదివారం మోదీ మాట్లాడారు. టీబీకి వ్యతిరేకంగా నిర్వహించే ఈ ఉద్యమానికి 'ని-క్షయ్ మిత్రా' బాధ్యతలు చేపట్టినట్లు మోదీ చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మంది టిబి రోగులను దత్తత తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. యువత కూడా దీనికి సహకరిస్తున్నారన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ని స్మరించుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలతో పాటు, అతని పాలన నుంచి నేర్చుకోవలసినది చాలా ఉందన్నారు. అతను నిర్మించిన కోటలు, అనేక శతాబ్దాల తర్వాత కూడా ఇప్పటికీ సముద్రం మధ్యలో సగర్వంగా నిలబడి ఉన్నాయన్నారు.
ఈ ఏడాది యోగా డే థీమ్‌ను ప్రకటించిన మోదీ
ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో అంతరించిపోయిన నదిని ప్రజలు పునరుద్ధరించడంపై ప్రధాని మోదీ ప్రశంసించారు. ఆ నదిని అమృత్ సరోవర్‌గా అభివృద్ధి చేస్తున్నట్లు మోదీ అన్నారు. ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇతివృత్తాన్ని కూడా మోదీ ప్రకటించారు. 'వసుధైవ కుటుంబానికి యోగా' థీమ్‌తో ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని తెలిపారు. ఈ సారి 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో మొదటిసారిగా తాను యోగా సెషన్‌కు నాయకత్వం వహిస్తున్నట్లు మోదీ చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.