Mann ki Baat: 'కాల పరీక్షలను తట్టుకుని నిలబడిన రాజ్యాంగం.. 'మన్ కీ బాత్'లో ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
రాజ్యాంగం మనకు మార్గదర్శకమైన దీపంగా అభివర్ణించారు ప్రధాని నరేంద్ర మోదీ . ఇది కాల పరీక్షలను తట్టుకుని నిలిచిందని పేర్కొన్నారు.
ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని, రాజ్యాంగ అమలుకు 75 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో ఈసారి గణతంత్ర దినోత్సవం ప్రత్యేకమైనదని చెప్పారు.
''దేశానికి మార్గనిర్దేశం చేసే రాజ్యాంగం కారణంగానే నేను ఈ స్థాయికి ఎదిగాను. రాజ్యాంగం గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి కాన్‌స్టిట్యూషన్75.కామ్ అనే వెబ్‌సైట్‌ను ప్రజలు సందర్శించాలి'' అని సూచించారు.
అలాగే, వచ్చే నెల 14 నుంచి ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమయ్యే మహా కుంభమేళా ద్వారా దేశంలో ఐక్యతను ప్రదర్శించాలని పిలుపునిచ్చారు.
భిన్నత్వంలో ఏకత్వానికి మహా కుంభమేళా ఉదాహరణగా నిలుస్తుందని, ఇలాంటి ఘనమైన వేడుక ప్రపంచంలో మరెక్కడా కనిపించదని తెలిపారు.
వివరాలు
అక్కినేని నాగేశ్వరరావు నటనాకౌశలంపై మోదీ ప్రశంసలు
విద్వేషం, విభజనకు వ్యతిరేకంగా ప్రజలు సంకల్పం చేయాలని, గంగా ప్రవాహంలా సమాజంలో ఐక్యత కొనసాగాలని ఆకాంక్షించారు.
తెలుగు సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు ప్రతిభపై మోదీ ప్రశంసలు కురిపించారు.
తెలుగు సినిమాను అక్కినేని మరో స్థాయికి తీసుకువెళ్లారని కొనియాడారు. ఆయనతో పాటు రాజ్‌కపూర్, మహ్మద్ రఫీ, తపన్ సిన్హా వంటి ప్రముఖుల శతజయంతి వేడుకలు కూడా ఈ ఏడాదే జరగడాన్ని ప్రస్తావించారు.
''రాజ్‌కపూర్ తన సినిమాల ద్వారా భారతదేశం సున్నితమైన అంశాలను ప్రపంచానికి పరిచయం చేశారు. మహ్మద్ రఫీ గాత్రం ప్రతి హృదయాన్నీ తాకుతుంది. ఆయన పాటలు ఇప్పటికీ ప్రస్తుత యువతను ఆకర్షిస్తున్నాయి'' అని మోదీ తెలిపారు. ఈ వారసత్వాలు భారత చలనచిత్ర పరిశ్రమకు స్ఫూర్తిదాయకమని అన్నారు.
వివరాలు
దిల్లీలో ప్రపంచ దృశ్య-శ్రవణ వినోద సదస్సు - వేవ్స్
మొదటిసారిగా ''ప్రపంచ దృశ్య-శ్రవణ వినోద సదస్సు - వేవ్స్''ను ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు దిల్లీలో నిర్వహించనున్నట్టు మోదీ ప్రకటించారు.
పరాగ్వే వంటి దేశాల్లో కూడా ఆయుర్వేదానికి లభిస్తున్న ఆదరణను ఆయన ప్రస్తావిస్తూ, భారత సాంప్రదాయ వైద్య విధానం ప్రపంచంలో ప్రత్యేకమైనదని తెలిపారు.