Chhattisgarh Encounter: బీజాపూర్ అడవుల్లో ఎదురుకాల్పులు.. మావో కమాండర్ పాపారావు హతం
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా మావోయిస్టుల నిర్మూలన లక్ష్యంగా భద్రతా బలగాలు చేపడుతున్న ఏరివేత ఆపరేషన్లు ఉద్ధృతంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఎదురుకాల్పుల్లో కీలక మావోయిస్టు కమాండర్ పాపారావుతో పాటు మరో మావోయిస్టు హతమయ్యాడు. ఘటనాస్థలిలో రెండు ఏకే-47 తుపాకీలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వ్యక్తి మావోయిస్టు కమాండర్ పాపారావేనని బీజాపూర్ పోలీసు సూపరింటెండెంట్ జితేంద్ర యాదవ్ అధికారికంగా తెలిపారు. ప్రస్తుతం బీజాపూర్ జాతీయ ఉద్యానవనం పరిధిలోని అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు.
Details
లొంగిపోయిన మరికొందరు మావోయిస్టులు
మావోయిస్టుల కదలికలపై సమాచారం అందిన వెంటనే డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) సిబ్బంది ఆపరేషన్ ప్రారంభించారని, ఎన్‌కౌంటర్ ఇంకా ముగియలేదని స్పష్టం చేశారు. మార్చి 2026 నాటికి దేశాన్ని మావోయిస్టు రహితంగా మార్చాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ లక్ష్యంతో దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయి. గతేడాది పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో మృతి చెందగా, మరికొందరు లొంగిపోయారు. ప్రస్తుతం ఇంకా లొంగిపోని మావోయిస్టులను గుర్తించి నిర్వీర్యం చేసే చర్యలు భద్రతా బలగాలు కొనసాగిస్తున్నాయి.