Maoist Narayana: మావోయిస్టు అగ్రనేత నారాయణ సరెండర్.. నక్సల్స్ ఫ్రీ ఏపీగా మారిన రాష్ట్రం
ఈ వార్తాకథనం ఏంటి
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చెన్నూరు నారాయణ రావు అలియాస్ సోమన్న, ఆంధ్రప్రదేశ్ డీజీపీ ముందు లొంగిపోయారు. దాదాపు 36 సంవత్సరాల పాటు మావోయిస్టు పార్టీలో కీలకంగా పనిచేసిన నారాయణతో పాటు మొత్తం 9 మంది సభ్యులు పోలీసుల ఎదుట ఆయుధాలు వదిలారు. లొంగిపోయిన వారిలో ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ, డివిజనల్, ఏరియా కమిటీలకు చెందిన మావోయిస్టులు ఉన్నారు. ఈ విషయాలను ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టు కార్యకలాపాలు ముగింపు దశకు చేరుకున్నాయని తెలిపారు. రాష్ట్రం ఇప్పుడు నక్సల్స్ ఫ్రీ స్టేట్‌గా మారిందని పేర్కొన్నారు.
వివరాలు
మొత్తం 9మంది లొంగిబాటు
అందరి సమిష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందని, ఈ ప్రక్రియలో కాల్పులు జరిగిన సందర్భాలున్నప్పటికీ, లొంగుబాట్లు కూడా చోటుచేసుకున్నాయని చెప్పారు. తమ పిలుపుకు స్పందించి మొత్తం 9 మంది లొంగిపోయారని వెల్లడించారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం అన్ని విధాల సహాయం అందిస్తుందని డీజీపీ తెలిపారు. చెన్నూరు నారాయణకు రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు, మిగతా సభ్యులకు రూ.24.20 లక్షలు చొప్పున మంజూరు చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో మావోయిస్టు అగ్రనేత గణపతి కార్యకలాపాలు కూడా లేవని పేర్కొన్నారు. ఈ పరిణామాలతో రాష్ట్రంలో శాంతి భద్రతలు మరింత బలపడుతున్నాయని అధికారులు భావిస్తున్నారు.
వివరాలు
లొంగిపోయిన మావోయిస్టులు
1. చెన్నూరు నారాయణ - కేంద్ర కమిటీ సభ్యుడు 2. కర్తం లచ్చు - కంపెనీ పార్టీ కమాండర్ 3. పోడియం రాజే - ఏరియా కమిటీ సభ్యురాలు 4. కర్తం ఆడమే - ప్లటూన్ పార్టీ కమిటీ సభ్యుడు 5. ముచిక మాస - ఏరియా కమిటీ సభ్యుడు 6. మాదవి జోగి - ప్లటూన్ పార్టీ కమిటీ సభ్యురాలు 7. ముచిక లక్ష్మణ్ - పార్టీ కమిటీ సభ్యుడు 8. మడవ ఆడమ - పార్టీ కమిటీ సభ్యుడు 9. కడితి హుర్రే - గచిరోలి పార్టీ సభ్యుడు ఈ లొంగుబాటుతో రాష్ట్రంలో నక్సలిజం నిర్మూలన దిశగా మరొక కీలక ముందడుగు పడినట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు.