
Mallojula Venugopal: 60 మందితో కలిసి లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల
ఈ వార్తాకథనం ఏంటి
మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బలు కొనసాగుతున్నాయి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ (ఎలియాస్ సోను) మంగళవారం పోలీసుల కంట్రోల్‌కి వచ్చారు. ఆయనతోపాటు సుమారు 60 మంది మహారాష్ట్ర గడ్చిరోలి ప్రాంతంలో పోలీసులకు లొంగారు. ఈ సంఘటనను ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ ధృవీకరించారు. మావోయిస్టు నేతలు జనజీవన స్రవంతిలో కలవడాన్ని హర్షిస్తున్నామని డిప్యూటీ సీఎం అన్నారు బస్తర్ ప్రజలు నక్సలిజం అంతం కావాలని కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
హిడ్మా, దేవ్ జీ వంటి నాయకులు ఆయన లేఖకు వ్యతిరేకం
గతంలో, ఈ ఏడాది సెప్టెంబర్‌లో మల్లోజుల ఆయుధాలు వదిలేసి శాంతి చర్చలకు ముందుకు రావాలని ప్రకటించారు. దీనికి మావోయిస్టు పార్టీ నార్త్ బస్తర్ డివిజన్ కమిటీ కూడా మద్దతు తెలిపింది. అయితే, హిడ్మా, దేవ్ జీ వంటి నాయకులు ఆయన లేఖకు వ్యతిరేకంగా నిలిచారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం మల్లోజుల మరో లేఖ విడుదల చేశారు. అందులో, గతంలో పార్టీ చేసిన తప్పుల పట్ల, ఉద్యమం విఫలమయ్యే పరిస్థితికి దారితీసినందుకు బాధ్యత వహిస్తూ, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా క్షమాపణలు కోరారు.
వివరాలు
పార్టీ పిడివాద, అతివాద విధానాల నుంచి మిగిలిన వారినైనా కాపాడుకోవాలి
"ఇంత భారీ నష్టం, ఎన్నో బలిదానాలకు కారణమైన విప్లవోద్యమ బాధ్యతలను కొనసాగించడానికి నేను ఎంతమాత్రం అర్హుడిని కాదని భావిస్తున్నాను. ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటికీ, ఇలాంటి నిర్ణయం సరైనది కాదని భావించవచ్చు. కానీ పరిస్థితులు దీన్ని తప్పనిసరిగా చేశాయి. వందల మంది మావోయిస్టులను కోల్పోతున్న ఈ సందర్భంలో, పార్టీని పిడివాద, అతివాద విధానాల నుంచి మిగిలిన వారిని రక్షించాల్సిన అవసరం ఉంది. విప్లవోద్యమాన్ని విజయవంతంగా నడిపించడానికి, బహిరంగంగా ప్రజల్లోకి వెళ్లటం తప్ప మరో మార్గం లేదు"అని మల్లోజుల తన లేఖలో తెలిపాడు.