#NewsBytesExplainer: మావోయిస్టులకు లొంగిపోవడం లేదా ఎన్‌కౌంటర్‌ను ఎదుర్కోవడం తప్ప వేరే మార్గం లేదా?
ఈ వార్తాకథనం ఏంటి
మావోయిస్టులు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసి, ఫిబ్రవరి వరకూ గడువు ఇస్తే అన్ని ఆయుధాలను పూర్తిగా వదిలేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తమ ఆధీనంలోని అన్ని కమిటీలు, విభాగాలకు సమాచారం ఇచ్చి, వారిని ఒకే నిర్ణయానికి తీసుకురావాలంటే ఈ సమయం అవసరమని వారు పేర్కొన్నారు. అయితే ఈ తరహా లేఖలకు ప్రభుత్వాలు స్పందించే కాలం గడిచిపోయింది. ప్రభుత్వం ఇప్పటికే స్పష్టంగా చెప్పింది. మావోయిస్టులకు ఇప్పుడు ఒకే ఒక మార్గం ఉంది. లొంగిపోవడం లేకపోతే ఎన్ కౌంటర్ అయిపోవడం. అంతే తప్ప ఇప్పుడు చర్చలు, ఆయుధాలు వదిలేస్తాం.. కాల్పుల విరమణ పాటిస్తాం అంటే.. పట్టించుకోవడానికి కేంద్రం సిద్దంగా లేదు.
వివరాలు
మావోయిస్టులు నిస్వార్థపరులు -కానీ వాస్తవాలు గుర్తించలేరా?
మావోయిస్టుల్లో చాలామంది తమ సిద్ధాంతాలు నమ్మి, కుటుంబాలను వదిలి అడవుల్లో దశాబ్దాల తరబడి జీవించారు. వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ రూపాయి కూడా సంపాదించుకున్నది లేదు తమ విశ్వాసాల కోసం చాలానే కష్టాలు, ప్రమాదాలు భరించారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన వారి మృతదేహాలను తీసుకెళ్లడానికే సహచరులు ఎన్ని ఇబ్బందులు పడతారో ప్రజలు చూస్తూనే ఉన్నారు. అందుకే ప్రజలకు వారి మీద ఒక మానవీయమైన సానుభూతి ఉంటుంది. కానీ కాలం మారింది, పరిస్థితులు మారాయి. ఈ మార్పును వారు అర్థం చేసుకోకపోతే, ప్రజల చేతుల్లో ఏమీ ఉండదు.
వివరాలు
చచ్చిపోయాక హిడ్మాను పొగిడితే ఏం వస్తుంది ?
హిడ్మా మృతి తర్వాత అందరూ ఆయన ధైర్యాన్ని, నిబద్ధతను పొగుడుతున్నారు. కానీ ఆయన పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్ అయ్యేంతవరకూ... "ఇలా అడవుల్లో కాకుండా, బయటికి వచ్చి ప్రజా జీవితంలో పనిచేసినా మరింత ప్రభావం చూపగలవు" అని ఆయనను ప్రోత్సహించినవారు దాదాపు ఎవరూ లేరు. పైగా మావోయిస్టులకు నువ్వే భవిష్యత్ అని చెప్పి రెచ్చగొట్టి ఉంటారు. చివరికి హిడ్మా ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటివారిని ఇప్పటికే ఎన్నో కోల్పోయారు. లొంగిపోకపోతే మిగిలినవారికి కూడా ఇదే ప్రమాదం తప్పదు. అడవుల్లో దాగి బతుకుతామనే నమ్మకం ఎవరికైనా ఉంటుందా?
వివరాలు
అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా లొంగిపోవడమే మంచిది !
తెలంగాణ డీజీపీ చాలా ఓపెన్ గా ఆఫర్ ఇచ్చారు. లొంగిపోవాలనుకునేవారికి, ముఖ్యంగా మల్లోజుల వేణుగోపాల్ వంటి వారికి, ప్రభుత్వం పూర్తిగా సాయం చేసేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. కాల్పుల విరమణ పాటించడం.. ఆయుధాలను వదిలి పెట్టడం.. చర్చలకు సిద్ధమని ఆఫర్ ఇచ్చే పరిస్థితుల్లో మావోయిస్టులు లేరు. మొండిగా పాత పద్ధతులు పట్టుకుని ఉంటే పార్టీ నిలబడుతుందన్నగ్యారంటీ లేదు. అందుకే, ప్రభుత్వం అందిస్తున్న చట్టపరమైన మార్గాల ద్వారా లొంగిపోవడం వాళ్లకు మంచి పరిష్కారంగా కనిపిస్తోంది. అలా చేస్తే, కనీసం ప్రజా జీవితంలోనైనా తమ సిద్ధాంతాలకు కొంత మద్దతు పొందే అవకాశముంది. కానీ ప్రభుత్వాలకు చేరని ఆఫర్లను లేఖల్లో పంపుతూ ఉంటే, వాళ్లు స్పందించరు. ప్రస్తుతం వారికి ఉన్న దృక్పథం ఒక్కటే — కనిపిస్తే కాల్చేయడమే.