బీజేపీ మండలాధ్యక్షుడిని హత్య చేసిన మావోయిస్టులు
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడిని అతని కుటుంబసభ్యుల ఎదుటే మావోయిస్టులు హతమార్చారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడు నీలకంఠం కక్కెం గత 15 ఏళ్లుగా బీజాపూర్ ఉసూరు బ్లాక్ బీజేపీ మండల అధ్యక్షుడిగా ఉన్నాడు. పెళ్లికి హాజరయ్యేందుకు వెళ్లిన ఆయనపై మావోయిస్టులు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. నీలకంఠం కక్కెంపై మావోయిస్టులు గొడ్డలితో దాడి చేసినట్లు బీజాపూర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ఏసీపీ) చంద్రకాంత్ గోవర్నా వెల్లడించారు. పేకారంలోని గ్రామస్తుల నుంచి ఈ సంఘటన గురించి పోలీసులకు సమాచారం అందిందని, ఆ తర్వాత తమ బృందాన్ని వెంటనే సంఘటన స్థలానికి పంపించామని ఆయన పేర్కొన్నారు.
గ్రామంలోకి 150మందికి పైగా సాయుధ మావోయిస్టులు
ఈ హత్యపై పోలీసులు విచారణ ప్రారంభించి, మావోయిస్టులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. కక్కెం మృతదేహాన్ని కూడా పోస్టుమార్టంకు పంపారు. నీలకంఠంపై దాడి చేసేందుకు 150మందికి పైగా సాయుధ మావోయిస్టులు గ్రామానికి వచ్చినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, అయితే ముగ్గురు మాత్రమే నీలకంఠం ఇంటికి వచ్చినట్లు ఏసీపీ తెలిపారు. మావోయిస్టులు సాధారణ దుస్తుల్లో వచ్చినట్లు ఆయన తెలిపారు. కక్కెం తన స్వగ్రామం పేకరంలో కుటుంబం సభ్యులతో కలిసి తన కోడలు పెళ్లికి సంబంధించిన ఏర్పాట్ల కోసం వచ్చాడు. ఈ సమయంలో మావోయిస్టులు హత్య చేశారు.