LOADING...
Maoist Party: మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం.. ఆయుధాలు వదిలేస్తాం.. అభయ్‌ పేరిట ప్రకటన
అభయ్‌ పేరిట ప్రకటన

Maoist Party: మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం.. ఆయుధాలు వదిలేస్తాం.. అభయ్‌ పేరిట ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 17, 2025
08:45 am

ఈ వార్తాకథనం ఏంటి

మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ ఆయుధాలను వదిలి తాత్కాలికంగా సాయుధ పోరాటం నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ప్రజా ఉద్యమాల్లో పాల్గొని దేశంలోని పీడిత ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పోరాటాల్లో పాల్గొంటామని పేర్కొంది. ఈ విషయాన్ని పార్టీ అధికార ప్రతినిధి అభయ్‌ పేరుతో తాజాగా ఒక ప్రకటన రూపంలో ప్రస్తావించారు. ఇందులో కిషన్‌జీ సోదరుడు మల్లోజుల వేణుగోపాల్‌ తాజా చిత్రాన్ని కూడా ప్రచురిస్తూ,ప్రజలు తమ అభిప్రాయాలు పంచుకునేందుకు ఈ-మెయిల్‌(nampet(2025)@gmail.com),ఫేస్‌బుక్‌ (nampetalk) ఐడీలను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. ప్రభుత్వం తమ ప్రతిపాదనను అంగీకరించిన వెంటనే ప్రజలతో తమ ఆలోచనలు పంచుకుంటామని ప్రకటించారు. గతంలో మావోయిస్టులు ఇలాంటి ప్రకటనలు విడుదల చేయని కారణంగా ఈ ప్రకటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ,నిఘా సంస్థలు దీనిని నిజమైన ప్రకటనగా చూస్తున్నాయి.

వివరాలు 

ప్రకటనలో ఏముందంటే.. 

ఈ ప్రకటన ఆగస్టు 15న వెలువడింది కానీ అది మంగళవారం రాత్రి నాడు ప్రచారంలోకి వచ్చింది. మావోయిస్టు పార్టీ ప్రధాన మంత్రి,హోం మంత్రి, ప్రభావిత ప్రాంతాల ముఖ్య మంత్రులు, హోంమంత్రులతో పాటు శాంతిచర్చలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న పాలక, ప్రతిపక్ష పార్టీలు, శాంతికమిటీ సభ్యుల ముందు తమ వైఖరిని స్పష్టం చేస్తున్నట్లు పేర్కొంది. మార్చి చివరి నుంచి మావోయిస్టు పార్టీ ప్రభుత్వంతో శాంతిచర్చలు జరపడానికి నిజాయతీగా ప్రయత్నిస్తున్నప్పటికీ,మే 10న పార్టీ ప్రధాన కార్యదర్శి అభయ్‌ పేరుతో ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో ఆయుధాలను వదులుతున్నట్లు పేర్కొంది. ప్రభుత్వానికి కాల్పుల విరమణ ప్రతిపాదించారు. ముఖ్య నేతలతో చర్చించేందుకు నెల సమయం కోరినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా స్పందించలేదు.

వివరాలు 

ప్రకటనలో ఏముందంటే.. 

బదులుగా 2024 జనవరి నుండి సైనిక దాడులు తీవ్రతరం కావడంతో, మే 21న మాడ్‌లో గుండెకోట్‌ సమీపంలో జరిగిన ఘోర దాడిలో పార్టీ ప్రధాన కార్యదర్శి బస్వరాజ్‌ సహా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. అభయ్‌ ప్రకారం, బస్వరాజ్‌ ఆలోచనలకు అనుగుణంగా శాంతిచర్చలను ముందుకు తీసుకెళ్లాలని ఈ ప్రకటన విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశప్రధాని ఆయుధాలను విడిచిపెట్టి ప్రధానస్రవంతిలో చేరాలని నిరంతరం చేసిన అభ్యర్థనల దృష్ట్యా మేం ఆయుధాలను వదలాలని నిర్ణయించుకున్నాం. కేంద్ర హోంమంత్రి లేదా ఆయన నియమించిన ప్రతినిధులతో చర్చలు జరపడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.

వివరాలు 

ప్రకటనలో ఏముందంటే.. 

"మా మారిన అభిప్రాయాన్ని పార్టీకి తెలియజేయడం మా బాధ్యత. ఈ అంశాన్ని వివరించి, శాంతిచర్చల్లో పాల్గొనే ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేస్తాం. వివిధ రాష్ట్రాల్లో పని చేస్తున్న సహచరులతో, జైళ్లలో ఉన్న సభ్యులతో సంప్రదించేందుకు మాకు నెల సమయం ఇవ్వాలి. ఈ విషయాన్ని ప్రభుత్వంతో వీడియో కాల్‌ ద్వారా పంచుకునేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నాము. అందువల్ల, నెల రోజుల పాటు కాల్పుల విరమణ, గాలింపు చర్యల నిలిపివేత ద్వారా శాంతి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం ప్రభుత్వం అనుకూల వైఖరిపై ఆధారపడి ఉంటుంది" అని అభయ్‌ పేర్కొన్నారు.