దగ్గు మందు తయారీలో మారియన్ ఫార్మాదే పాపం.. ప్రమాదకర పారిశ్రామిక గ్రేడ్ ప్రాపిలెన్ గ్లైకాల్ వినియోగం
ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన వైద్య ఔషధాలు ప్రాణాలనే తీయడం వెనుక విస్తుబోయే విషయాలు తేటతెల్లమయ్యాయి. లాభాల కోసం మారియన్ బయోటెక్ అనే ఫార్మా కంపెనీ దారుణాలకు ఒడిగట్టింది. గతేడాది భారతదేశంలో మారియన్ బయోటెక్ ఫార్మా సంస్థ తయారు చేసిన దగ్గు మందు సిరప్ (యాంబ్రోనాల్, డాక్ 1 మ్యాక్స్) తాగి ఉజ్బెకిస్థాన్ లో 19 మంది చిన్నారులు మరణించారు. ఈ విషయంపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, చిన్నారులు మృతి చెందడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఔషధ తయారీలో ఫార్మా గ్రేడ్ కు బదులు, ప్రమాదకర పారిశ్రామిక గ్రేడ్ ప్రాపిలెన్ గ్లైకాల్ ను ఉపయోగించినట్టు తెలుస్తోంది.
మాయాకెమ్ టెక్ ఇండియాకు అనుమతి లేదు
ఈ ప్రాపిలెన్ గ్లైకాల్ ను మాయాకెమ్ టెక్ ఇండియా నుంచి కొనుగోలు చేసినట్టు సమాచారం. అయితే ఫార్మాస్యూటికల్ గ్రేడ్ కోసం వినియోగించేందుకు సదరు సంస్థకు లైసెన్స్ లేదు. కేవలం ఇండస్ట్రియల్ గ్రేడ్ ఉత్పత్తులను మాత్రమే విక్రయించేందుకు అనుమతి ఉందని ఫార్మా వర్గాలు తెలిపాయి. పారిశ్రామిక గ్రేడ్ ప్రాపిలెన్ గ్లైకాల్ ను లిక్విడ్ డిటర్జెంట్, పెయింట్స్, కోటింగ్స్, పురుగు మందుల తయారీలో వినియోగిస్తారని ఓ దర్యాప్తు అధికారి వెల్లడించారు. దగ్గు మందు తయారీకి ముందు ప్రాపిలెన్ గ్లైకాల్ ను మారియన్ బయోటెక్ పరీక్షించలేదని ప్రాథమికంగా తేలింది. చిన్నారుల మరణం అనంతరం దగ్గు మందులను ఉజ్బెకిస్థాన్ పరీక్షించింది. ప్రమాదకర రీతిలో డైఎథిలిన్ గ్లైకాల్, ఎథిలిన్ గ్లైకాల్ ఉన్నట్లు ఆ దేశ ల్యాబ్ లు గుర్తించాయి.