Delhi Assembly: అసెంబ్లీ గేటు ఢీకొట్టి లోపలికి ప్రవేశించిన ముసుగు వ్యక్తి అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీ అసెంబ్లీలో భద్రత లోపం బయటపడింది. సోమవారం మధ్యాహ్నం ముసుగు ధరించిన వ్యక్తి కారుతో గేట్ నంబర్ 2ను బలవంతంగా దాటుకుని లోపలికి ప్రవేశించి, అక్కడ పూల బొకే ఉంచి పరార్ అయ్యాడు. ఈ ఘటనతో అక్కడ కలకలం రేగింది. వెంటనే పోలీసులు, భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యి విస్తృతంగా గాలింపు చేపట్టారు. కొన్ని గంటల్లోనే ఆ వ్యక్తిని సర్బజిత్ సింగ్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు. అతను వాడిన యూపీ నంబర్ ఉన్న టాటా సియెర్రా కారును ఉత్తర ఢిల్లీలోని రూప్ నగర్ ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల బడ్జెట్ సమావేశాల సమయంలో అసెంబ్లీకి బాంబు బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో ఈ ఘటన మరింత ఆందోళన కలిగించింది.
వివరాలు
గేట్ దగ్గర బొకే
సీఆర్పీఎఫ్ భద్రత ఉన్న వీఐపీ ఎంట్రన్స్ వద్ద గేట్‌ను ఢీకొట్టి లోపలికి వచ్చిన డ్రైవర్, వాహనం ఆపి ప్రశాంతంగా దిగి వెళ్లి గేట్ దగ్గర బొకే ఉంచి వెళ్లిపోయినట్టు అధికారులు తెలిపారు. అనంతరం స్పీకర్ విజేంద్ర గుప్తా కార్యాలయం వైపు వెళ్లి పోర్చ్ వద్ద కూడా పూలను ఉంచినట్టు వెల్లడించారు. సంఘటన స్థలంలో బాంబ్ డిస్పోజల్ బృందం తనిఖీలు నిర్వహించగా, ఇప్పటివరకు బొకేలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని అధికారులు తెలిపారు.