LOADING...
Andhra Pradesh: ఏపీ లో 2.5 లక్షల టిడ్కో ఇళ్ల గృహప్రవేశాలు
ఏపీ లో 2.5 లక్షల టిడ్కో ఇళ్ల గృహప్రవేశాలు

Andhra Pradesh: ఏపీ లో 2.5 లక్షల టిడ్కో ఇళ్ల గృహప్రవేశాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 30, 2026
08:38 am

ఈ వార్తాకథనం ఏంటి

పేదల స్వంత ఇంటి కల ఇక నిజం కానుంది. ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్న వేలాది కుటుంబాల నిరీక్షణకు ముగింపు దొరకబోతోంది. ఏపీలో లక్ష టిడ్కో గృహాలను కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధమైంది. వీటితో పాటు కాలనీల్లో ఇప్పటికే పూర్తయిన మరో 1.50 లక్షల ఇళ్లను కలిపి మొత్తం 2.50 లక్షల ఇళ్లకు ఒకేసారి గృహప్రవేశాలు నిర్వహించనుంది. ఈ భారీ కార్యక్రమం తిరుపతి జిల్లా నాయుడుపేటలో సోమవారం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించనున్నారు. ఆయన ఉదయం 10 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి, 11.50 గంటలకు సూళ్లూరుపేట నియోజకవర్గంలోని పుదూరుకు చేరుకుంటారు. అనంతరం 11.55 గంటలకు టిడ్కో ఇళ్లలో గృహప్రవేశ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

వివరాలు 

గత ప్రభుత్వ నిర్లక్ష్యం.. కొత్త ప్రభుత్వ వేగం

2017-19 మధ్య కాలంలోనే టిడ్కో గృహాల నిర్మాణం పెద్ద ఎత్తున పూర్తయింది. అయితే తరువాతి ప్రభుత్వ హయాంలో మౌలిక సదుపాయాల లోపం కారణంగా ఈ ఇళ్ల పంపిణీ నిలిచిపోయింది. కేవలం అలంకరణలతో కాలక్షేపం చేసినప్పటికీ, లబ్ధిదారులు మాత్రం అద్దె ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి పూర్తిగా మారింది. అసంపూర్తిగా ఉన్న గృహాల నిర్మాణం వేగవంతం చేయడంతో పాటు, అవసరమైన అన్ని మౌలిక వసతులపై దృష్టి పెట్టింది. సిమెంట్ రహదారులు, తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థలు, ఎస్‌టీపీలు వంటి అన్ని సదుపాయాలను కల్పిస్తూ గృహాలను సిద్ధం చేసింది. టిడ్కో ఇళ్లు 300 చ.అ., 365 చ.అ., 430 చ.అ. విస్తీర్ణాల్లో నిర్మించబడినవి.

వివరాలు 

21 నెలల్లో 5.50 లక్షల ఇళ్ల పూర్తి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గృహనిర్మాణ రంగంలో వేగం పెరిగింది. గత 21 నెలల్లో రెండోసారి భారీ స్థాయిలో ఇళ్ల పంపిణీ కార్యక్రమం చేపడుతోంది. గత ఏడాది: 3 లక్షల ఇళ్ల పంపిణీ ప్రస్తుత దశలో: 2.50 లక్షల ఇళ్ల పంపిణీ మొత్తం: 5.50 లక్షల ఇళ్లు పూర్తి ఇది రాష్ట్రంలో పేదల గృహ కలను సాకారం చేసే దిశగా పెద్ద అడుగుగా భావిస్తున్నారు.

Advertisement

వివరాలు 

పీ-4 కార్యక్రమానికి ఏడాది.. తిరుపతిలో వేడుకలు

గృహప్రవేశాల అనంతరం సీఎం చంద్రబాబు తిరుపతికి వెళ్లనున్నారు. పేదరిక నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం ప్రారంభించిన పీ-4 కార్యక్రమానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించే వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.

Advertisement