Mumbai: ముంబైలో సామూహిక విషప్రయోగ యత్నం అడ్డుకున్న పోలీసులు.. 15 వేలకుపైగా విష క్యాప్సూల్స్ స్వాధీనం
ఈ వార్తాకథనం ఏంటి
మొహర్రం ఊరేగింపును లక్ష్యంగా చేసుకుని ముంబైలో సామూహిక విషప్రయోగానికి పన్నిన పెద్ద కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఈ కేసులో పూణెకు చెందిన ఓ వ్యాపారిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి సుమారు 15 వేల విషపూరిత క్యాప్సూల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అధికారుల వేగవంతమైన చర్యలతో నగరంలో సంభవించే భారీ ప్రమాదం తప్పినట్లు వెల్లడైంది.
వివరాలు
పోలీసుల వివరాల ప్రకారం ఏం జరిగిందంటే..
పూణెలోని విమాన్ నగర్ ప్రాంతానికి చెందిన 39 ఏళ్ల ఫయాజ్ ప్రేమ్‌జీ అనే పెయింట్ వ్యాపారి ఈ కుట్రకు ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. అతడు దక్షిణ ముంబైలోని డోంగ్రీ ప్రాంతంలోని ఒక గెస్ట్ హౌస్‌లో బస చేస్తూ, మొహర్రం ఊరేగింపులో పాల్గొనే వారికి నొప్పి నివారణ మాత్రలు లేదా రోగనిరోధక శక్తిని పెంచే క్యాప్సూల్స్ పేరుతో ఎలుకల మందు కలిపిన క్యాప్సూల్స్ పంపిణీ చేయాలని యోచించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఒక వ్యక్తికి క్యాప్సూల్ ఇవ్వగా, దాన్ని తీసుకున్న వెంటనే అతడికి వాంతులు, తీవ్రమైన కడుపునొప్పి రావడంతో అనుమానం వ్యక్తమైంది. బాధితుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు వెంటనే స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాలు
దర్యాప్తులో కొత్త విషయాలు..
అనంతరం అతడి వద్ద నుంచి అత్యంత ప్రమాదకరమైన జింక్ ఫాస్ఫైడ్ అనే విషపదార్థంతో నింపిన 14,900 క్యాప్సూల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో గత ఏడాది కాలంలో నిందితుడు ఇరాన్, ఇరాక్ దేశాలకు మొత్తం 19 సార్లు వెళ్లినట్లు బయటపడింది. అలాగే అతడి తల్లి, సోదరి ప్రస్తుతం ఇరాన్‌లో నివసిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ కుట్రకు అంతర్జాతీయ సంబంధాలు ఉన్నాయా? లేక అతడు ఒంటరిగా ఈ చర్యకు పాల్పడ్డాడా? అనే అంశాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (BNS) కింద హత్యాయత్నం, విషప్రయోగం తదితర తీవ్రమైన నేరాల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.