LOADING...
Telangana: గిగ్ వర్కర్లకు మే డే గిఫ్ట్‌.. బిల్లుకు గవర్నర్ ఆమోదం
గిగ్ వర్కర్లకు మే డే గిఫ్ట్‌.. బిల్లుకు గవర్నర్ ఆమోదం

Telangana: గిగ్ వర్కర్లకు మే డే గిఫ్ట్‌.. బిల్లుకు గవర్నర్ ఆమోదం

వ్రాసిన వారు Jayachandra Akuri
May 01, 2026
10:50 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో లక్షలాది గిగ్ వర్కర్ల జీవితాల్లో మే డే (మే 1) కొత్త ఆశలు నింపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 'తెలంగాణ ప్లాట్‌ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ బిల్లు'కు గవర్నర్ ఆమోదం లభించడంతో, నేడు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబెర్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో పనిచేసే డెలివరీ బాయ్స్,క్యాబ్ డ్రైవర్లకు చట్టపరమైన రక్షణ లభించనుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈచట్టం గిగ్ వర్కర్లకు సామాజిక భద్రతను కల్పించడంపై దృష్టి సారించింది. ఉద్యోగ భద్రత, ఆరోగ్య బీమా, ఇతర సంక్షేమ పథకాలను అందించడమే దీని ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా అగ్రిగేటర్ కంపెనీల కార్యకలాపాలపై నియంత్రణ విధిస్తూ, వారి ఇష్టారాజ్యానికి చెక్ పెడుతూ, గిగ్ వర్కర్ల హక్కులకు చట్టబద్ధత కల్పించారు.

వివరాలు

కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు

ఇక సర్వీస్ టాక్స్‌లోని కొంత భాగాన్ని ప్రత్యేకంగా గిగ్ వర్కర్ల సంక్షేమ నిధికి మళ్లించే విధంగా నిబంధనలు రూపొందించారు. అలాగే పనివేళల నియంత్రణ, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ బిల్లును అమలు చేసే దిశగా కార్మిక శాఖ ఆధ్వర్యంలో అగ్రిగేటర్లతో సమావేశాలు నిర్వహించనున్నారు. మరో 10 నుంచి 15 రోజుల్లో పూర్తిస్థాయి మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అసంఘటిత రంగంలో వేగంగా విస్తరిస్తున్న గిగ్ ఎకానమీకి ఈ చట్టం కీలక మలుపు తిప్పనుంది. దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల హక్కుల కోసం జరుగుతున్న పోరాటంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement