ఎంబీబీఎస్ స్టూడెంట్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్; భారీగా పెరిగిన సీట్లు
ఎంబీబీఎస్ స్టూడెంట్స్‌కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2023-24 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణలో వైద్య కళాశాలల్లో సీట్లు భారీగా పెరిగినట్లు చెప్పారు. ఈ ఏడాది భారతదేశంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పెరిగిన 2118 ఎంబీబీఎస్ సీట్లలో 900 తెలంగాణకు చెందినవని ఆరోగ్య మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఈ ఏడాది భారతదేశంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కొత్తగా యాడ్ చేసిన ఎంబీబీఎస్ సీట్లలో 43శాతం తెలంగాణకే రావడం గర్వకారమణంగా ఉందన్నారు. ఈ సీట్లు కేటాయింపు అనేది తెలంగాణలో ఆరోగ్య రంగానికి సీఎం కేసీఆర్ ఇస్తున్న ప్రాధాన్యతకు ఇది నిదర్శనమని హరీష్ రావు అన్నారు.
వైద్య కళాశాలల అడ్మిషన్ల నిబంధనలను సవరించిన తెలంగాణ
తెలంగాణలో వైద్య విద్యను అభ్యసించాలనే స్థానిక విద్యార్థుల ఆకాంక్షలకు పెద్దపీట వేస్తూ రాష్ట్ర వైద్య కళాశాలల అడ్మిషన్ల నిబంధనలను సవరిస్తూ కేసీఆర్ సర్కార్ మంగళవారం ఉత్తర్వులను విడుదల చేసింది. దీని వల్ల 2023-24 ఈ విద్యా సంవత్సరం నుంచి 1820 అదనపు ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. తాజా సవరణతో 2014, జూన్ 2, (రాష్ట్ర ఏర్పాటు) తర్వాత ఏర్పాటైన మెడికల్ కాలేజీల్లో అందుబాటులో ఉన్న మెడికల్ సీట్లలో 100 శాతం తెలంగాణ విద్యార్థులకే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అంటే 2014 తర్వాత ఏర్పాటైన మెడికల్ కాలేజీలు తమ ఎంబీబీఎస్ సీట్లలో 100 శాతం తెలంగాణ విద్యార్థులకు కేటాయించాల్సి ఉంటుంది.
తెలంగాణలో 56కు పెరిగిన మెడికల్ కాలేజీలు
ఇది వరకు మెడికల్ కాలేజీలలో మెడికల్ సీట్లలో 85 శాతం మాత్రమే తెలంగాణ విద్యార్థులకు రిజర్వ్ చేయబడగా, మిగిలిన 15 శాతం అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీకి వెళ్లేది. ఈ 15శాతం సీట్ల కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి అభ్యర్థులు పోటీ పడేవారు. అయితే ఇక నుంచి రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన మెడికల్ కాలేజీల్లోని మెడికల్ సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ కానున్నాయి. రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణలో 20 మెడికల్ కాలేజీలు (ప్రభుత్వ, ప్రైవేట్) ఉండగా, 2023-34 నాటికి మొత్తం మెడికల్ కాలేజీలు (ప్రభుత్వ, ప్రైవేట్) 56కి పెరిగాయి.