Delhi: బంగ్లాదేశ్ పిల్లల గుర్తింపుపై MCD సర్క్యులర్.. దిల్లీ పాఠశాలలకు కీలక ఆదేశాలు
దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలస వచ్చిన పిల్లలను గుర్తించాల్సిందిగా పాఠశాలలకు సర్క్యులర్ జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం, విద్యార్థుల జనన ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి, వారికి సంబంధించిన వివరాలను ధృవీకరించాలని సూచించింది. అక్రమ వలసదారుల పిల్లల జాబితాను రూపొందించి, ఈ అంశంపై చర్యలు తీసుకున్న వివరాలను డిసెంబర్ 31 నాటికి అందజేయాలని కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం దిల్లీలోని అక్రమ వలసదారులను గుర్తించడానికి ఇచ్చిన ఆదేశాల తరువాత వచ్చింది.
ఇది అవమానపు చర్య : ఆప్ ఎంపీ
పాఠశాలల విద్యాశాఖ బంగ్లాదేశ్ వలసదారుల పిల్లల ప్రవేశాలను పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటోందని MCD డిప్యూటీ కమిషనర్ పేర్కొన్నారు. MCD తక్షణం బంగ్లాదేశ్ వలసదారుల ఆక్రమణలను తొలగించాల్సిందిగా అన్ని మున్సిపల్ జోన్లకు సూచనలిచ్చింది. ఈ చర్యలు అసెంబ్లీ ఎన్నికల సమీపంలో జరుగుతుండటంతో, వలసదారుల సమస్య రాజకీయంగా కీలకంగా మారింది. ఈ ఆదేశాలపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. ఇది పూర్వాంచల్ ప్రజలను అవమానపరచడానికి చేసిన చర్య అని ఆరోపించారు. బీజేపీ నాయకత్వం వారిని బంగ్లాదేశీ వలసదారులుగా చిత్రీకరించడాన్ని ఖండించారు.
వేడెక్కిన దిల్లీ రాజకీయాలు
ఉత్తరప్రదేశ్, బిహార్ నుంచి వలస వచ్చిన పేదలను లక్ష్యంగా చేసుకుని, వారి జీవనాధారాలను ధ్వంసం చేయడానికి ఈ ఆదేశాలిచ్చారని మండిపడ్డారు. పూర్వాంచల ప్రజలు తూర్పు ఉత్తర ప్రదేశ్, బిహార్ నుంచి వలస వచ్చి దిల్లీలో ప్రధానంగా స్థిరపడ్డారు. వారు దిల్లీ ఓటర్లలో 42 శాతం ఉన్నారని సమాచారం. ముఖ్యంగా బురారీ, లక్ష్మీ నగర్, ద్వారక వంటి నియోజకవర్గాల్లో వారి ప్రభావం అధికంగా ఉంది. వలసదారుల గుర్తింపు, బంగ్లాదేశ్ వలసదారుల అంశం ప్రస్తుతం బీజేపీ-ఆప్ పార్టీల మధ్య రాజకీయ వివాదంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ఈ అంశం మరింత వేడక్కే అవకాశం ఉంది.