Naravane: నన్నూ, నా పుస్తకాన్ని వివాదంలోకి లాగారు.. ఇది కరెక్టు కాదు: మాజీ ఆర్మీ చీఫ్
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల పార్లమెంట్ వేదికగా తన పుస్తకంపై జరిగిన తీవ్ర చర్చల నేపథ్యంలో భారత సైన్యం మాజీ అధిపతి జనరల్ మనోజ్ నరవణె మౌనం వీడారు. ఆయన రాసిన పుస్తకం 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ'పై అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద రాజకీయ వివాదం నెలకొన్నప్పటికీ ఇప్పటివరకు ఆయన స్పందించలేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. నరవణె మాట్లాడుతూ, తన పుస్తకం ఇంకా అధికారికంగా ప్రచురించకముందే దానిని వివాదంలోకి లాగారని వ్యాఖ్యానించారు. ఈ వివాదంలో తనను అనవసరంగా ఇరికించారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పరోక్షంగా రాహుల్ గాంధీపై విమర్శలు చేసినట్లు కూడా భావిస్తున్నారు.
వివరాలు
ఇప్పటికే రెండు పుస్తకాలను రాశాను
ఇటీవల ఆయన రాసిన మరో పుస్తకం 'ద క్యూరియస్ అండ్ ద క్లాసిఫైడ్: అన్‌ఎర్త్ మిలిటరీ మైత్స్ అండ్ మిస్టరీస్' విడుదలైన సందర్భంగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన మొదటి పుస్తకం 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ'పై జరిగిన వివాదం అనంతరం తాను మరో రెండు పుస్తకాలు రచించానని, వాటిలో ఒకటి ఇప్పటికే విడుదలైందని, మరొకటి త్వరలో విడుదల కానుందని తెలిపారు. అయితే 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' పుస్తకాన్ని పూర్తిగా పరిశీలించేవరకు ప్రచురణ నిలిపివేయాలని రక్షణ మంత్రిత్వ శాఖ కోరిందని ఆయన పేర్కొన్నారు. ఆ అంశం అక్కడితో ముగిసిన విషయమేనని, తాను కూడా దాన్ని ముగిసిన అధ్యాయంగా భావించానని అన్నారు.
వివరాలు
అనవసరంగా పెద్ద చర్చకు దారితీశారు
కానీ ప్రచురితం కాని పుస్తకాన్ని ముందుకు తెచ్చి కొందరు అనవసరంగా పెద్ద చర్చకు దారితీశారని, తద్వారా తనను కూడా వివాదంలోకి లాగారని ఆయన తీవ్రంగా స్పందించారు. ఇది సమంజసం కాదని నరవణె అభిప్రాయపడ్డారు. చైనా దళాలతో భారత సైన్యం మధ్య జరిగిన ఘర్షణలకు సంబంధించిన కొన్ని అంశాలను ఈ పుస్తకంలో ప్రస్తావించారని సమాచారం. ఈ కారణంగానే రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి ప్రచురణకు అనుమతి లభించలేదు. అయినప్పటికీ అప్పట్లో ఈ పుస్తకాన్ని పార్లమెంట్‌లోకి తీసుకువచ్చిన ఘటన పెద్ద రాజకీయ చర్చకు దారితీసింది.