Medical Shops: ఈ-ఫార్మసీలకు వ్యతిరేకంగా నేడు మెడికల్ షాపుల బంద్
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా నేడు మెడికల్ దుకాణాలు బంద్ పాటించనున్నాయి. ఆన్‌లైన్ ద్వారా మందుల అమ్మకాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ పిలుపుతో ఈ ఆందోళన చేపడుతున్నారు. దేశంలోని సుమారు 16 లక్షల మెడికల్ దుకాణాలు బుధవారం మూతపడనున్నట్లు సమాచారం. దీంతో మందుల సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. అత్యవసర మందులు, ప్రాణాపాయ పరిస్థితుల్లో అవసరమయ్యే ఔషధాలు అందుబాటులో ఉండేలా జిల్లా అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అలాగే పెద్ద ఔషధ విక్రయ కేంద్రాలు, ఆస్పత్రుల్లోని మందుల దుకాణాలు, జనఔషధి కేంద్రాలు, అమృత్ కేంద్రాలు సాధారణంగా పనిచేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
వివరాలు
ఆన్‌లైన్‌లో మందులు కొనుగోలు చేయడం ప్రమాదకరం: వైద్య నిపుణులు
కరోనా సమయంలో ప్రజలకు మందులు సులభంగా చేరేందుకు కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా ఇంటికే మందుల పంపిణీకి అనుమతి ఇచ్చింది. అయితే మహమ్మారి తగ్గిన తర్వాత కూడా పెద్ద సంస్థలు అదే విధానాన్ని కొనసాగిస్తూ ఆన్‌లైన్‌లో మందులు విక్రయిస్తున్నాయని రిటైల్ వ్యాపారులు ఆరోపిస్తున్నారు. వైద్యుల చీటీని సరిగా పరిశీలించకుండానే మందులు అందిస్తున్నారని,ఇది ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతోందని వారు చెబుతున్నారు. నిత్యావసర వస్తువుల మాదిరిగా మందులను విక్రయించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. భారీ రాయితీలతో ఆన్‌లైన్ సంస్థలు మార్కెట్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని కెమిస్టులు అంటున్నారు. దీంతో చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య నిపుణులు కూడా కేవలం తక్కువ ధర కోసం ఆన్‌లైన్‌లో మందులు కొనుగోలు చేయడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.
వివరాలు
వైద్యుల చీటీతోనే కొన్ని ప్రత్యేక మందులు విక్రయించాలి
ఔషధ నియంత్రణ చట్టాల ప్రకారం కొన్ని ప్రత్యేక మందులు తప్పనిసరిగా వైద్యుల చీటీతోనే విక్రయించాలి. ముఖ్యంగా యాంటీబయాటిక్స్, నొప్పి నివారణ మందులు, ఇన్ఫెక్షన్ చికిత్సకు ఉపయోగించే ఔషధాలు, నిద్ర మాత్రలు, మత్తు ప్రభావం కలిగించే మందులు నియంత్రణలో ఉండాలి. అయితే ఆన్‌లైన్ విక్రయాల కారణంగా ఇవి దుర్వినియోగం అవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల కెమిస్టుల సంఘ ప్రతినిధులు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ అధికారులతో సమావేశమై ఆన్‌లైన్ ఫార్మసీల నియంత్రణపై చర్చించారు. చట్టపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్లు సమాచారం.
వివరాలు
ఈ ప్రాంతాలలో బంద్‌లో పాల్గొని సంఘాలు
అయితే ఈ బంద్‌కు అన్ని రాష్ట్రాల నుంచి మద్దతు లభించడం లేదు. పశ్చిమ బెంగాల్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, సిక్కిం, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో పాటు లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతంలోని సంఘాలు బంద్‌లో పాల్గొనబోమని ప్రకటించాయి. ఆన్‌లైన్ ఔషధ విక్రయాల నియంత్రణ, ప్రజారోగ్య రక్షణ, రిటైల్ వ్యాపారుల జీవనోపాధి వంటి అంశాల చుట్టూనే ఈ వివాదం కొనసాగుతోంది. తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు దేశవ్యాప్తంగా కెమిస్టులు ఒక్కరోజు బంద్ నిర్వహించనున్నారు.