
Medigadda Barrage: మేడిగడ్డ కుంగుబాటు.. 17 మంది ఇంజినీర్లపై క్రిమినల్ చర్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
మేడిగడ్డ బ్యారేజి కుంగిన ఘటనలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ 17మంది ఇంజినీర్లపై క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేసింది.
అదనంగా మరో 30 మంది ఇంజినీర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. బ్యారేజి నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీపై కూడా చర్యలు అవసరమని నివేదిక పేర్కొంది.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజి పియర్లు కుంగిపోవడంతో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ చేపట్టింది.
తొలుత ప్రాథమిక నివేదికను సమర్పించిన అనంతరం, మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల సీపేజీపై కూడా సమగ్రంగా పరిశీలించి, తుది నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఈ నివేదిక నీటిపారుదల శాఖకు చేరుకున్న నేపథ్యంలో, శుక్రవారం అధికారుల మధ్య తదుపరి కార్యాచరణపై చర్చలు జరిగాయి.
Details
క్రిమినల్ చర్యలకు సిఫార్సు
మేడిగడ్డ బ్యారేజి వైఫల్యానికి సంబంధించి, 17 మంది సీనియర్ ఇంజినీర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ స్పష్టం చేసింది.
వారిలో డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగాల్లో పనిచేసిన ఇంజినీర్లు ఉన్నారు.
ముఖ్యంగా మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, మాజీ ఎస్‌ఈ రమణారెడ్డి, ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తిరుపతిరావు తదితరులపై చర్యలు తీసుకోవాలని సూచించింది.
బ్యారేజి నిర్మాణ సమయంలో నాణ్యత తనిఖీలో లోపాలు, నిర్వహణ సమయంలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగం విఫలం కావడం, అలాగే డిఫెక్ట్ లయబులిటీ పీరియడ్‌లోనూ చర్యలు తీసుకోకపోవడం ప్రధాన కారణాలుగా గుర్తించారు.
మాజీ ఈఎన్సీ మురళీధర్, ప్రస్తుత చీఫ్ ఇంజినీర్ సుధాకర్‌రెడ్డి తదితరులపైనా చర్యలకు సిఫార్సు చేసినట్లు సమాచారం.
Details
శాఖాపరమైన చర్యలకు సిఫార్సు
క్రిమినల్ చర్యలకు సంబంధించిన 17 మంది కాకుండా 30 మంది ఇంజినీర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిఫార్సు చేసింది. వీరిలో డీఈఈలు, ఏఈఈలు ఉన్నారు.
తాజా నివేదిక నేపథ్యంలో ఈ ఇంజినీర్లకు పదోన్నతులు కల్పించాలా లేదా అన్న దానిపై నీటిపారుదల శాఖ ఆలోచనలో పడింది. ఇటీవల ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ)లకు పదోన్నతులపై డీపీసీ సమావేశం జరిగింది.
తొమ్మిది మంది పేర్లు సిఫార్సు కాగా, అందులో గతంలో కాళేశ్వరం మొదటి లింక్‌లో ఎస్‌ఈగా పనిచేసి ప్రస్తుతం రామగుండం చీఫ్ ఇంజినీర్‌గా ఉన్న సుధాకర్‌రెడ్డి కూడా ఉన్నారు.
ఎస్‌ఈల నుంచి సీఈలకు పదోన్నతుల కోసం గురువారం జరగాల్సిన డీపీసీ సమావేశం వాయిదా పడింది.