Gallantry Awards: ఆపరేషన్ సిందూర్‌లో సత్తా చాటిన సైనికులకు.. శౌర్య పురస్కారాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
దేశరక్షణలో అసాధారణ ధైర్యసాహసాలు,విశిష్ట సేవలను అందించిన భారత సైనికదళాల సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం శౌర్య పురస్కారాలను ప్రకటించింది. ఇటీవల విజయవంతంగా ముగిసిన "ఆపరేషన్ సిందూర్"తో పాటు పలు కీలక సైనిక ఆపరేషన్లలో ప్రముఖ పాత్ర పోషించిన ఆర్మీ,వైమానిక దళ అధికారులకు ప్రతిష్ఠాత్మక"వీర చక్ర" అవార్డులను ప్రదానం చేసింది. ఇందుకోసం కేంద్రం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉగ్రవాదశిబిరాలను సమూలంగా ధ్వంసం చేసిన 1988 (ఇండిపెండెంట్) మీడియం బ్యాటరీ కి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ సుశీల్ బిస్త్ వీరచక్రకు ఎంపికయ్యారు. అలాగే అత్యంత రహస్యంగా,తక్కువ సమయంలోనే ప్రత్యేక పరికరాలను విమానాల ద్వారా సురక్షితంగా రవాణా చేసి సైనికసామర్థ్యాన్నిచాటిన 302 మీడియం రెజిమెంట్కి చెందిన కల్నల్ కోశాంక్ లాంబా కూ ఇదే పురస్కారం లభించింది.
వివరాలు
స్క్వాడ్రన్ లీడర్ సిద్ధాంత్ సింగ్ లకు కూడా వీర చక్ర
భారత వైమానిక దళం(ఐఏఎఫ్)నుంచి కూడా పలువురు అధికారులు వీర చక్ర గౌరవం పొందుతున్నారు. శత్రు గగనతలాన్ని దాటుకుని నిర్దేశిత లక్ష్యాలను కచ్చితంగా ఛేదించినందుకుఫైటర్ పైలట్ గ్రూప్ కెప్టెన్ రంజీత్ సింగ్ సిద్ధూ ఈ గౌరవం అందుకున్నారు. ఫార్వర్డ్ ఎయిర్‌బేస్‌లో సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ (SAM)స్క్వాడ్రన్‌ను నడిపించి,శత్రువులకు భారీ నష్టం కలిగిస్తూ మన వనరులను కాపాడిన గ్రూప్ కెప్టెన్ అనిమేశ్ పట్నీకీ వీర చక్ర దక్కింది. అదే విధంగా,అతి ప్రమాదకరమైన మిషన్‌లో భాగంగా అర్ధరాత్రి వేళ శత్రు భూభాగంలోకి ప్రవేశించి కోటల వంటి లక్ష్యాలను ధ్వంసం చేసిన స్క్వాడ్రన్ లీడర్ రిజ్వాన్ మాలిక్,క్లిష్టమైన వైమానిక దాడిలో అద్భుత సమన్వయం ప్రదర్శించినస్క్వాడ్రన్ లీడర్ సిద్ధాంత్ సింగ్ లకు కూడా వీర చక్ర పురస్కారాలు ప్రకటించారు.
వివరాలు
127 గ్యాలంట్రీ అవార్డులు, 40 విశిష్ట సేవా పురస్కారాలు
మొత్తంగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 127 గ్యాలంట్రీ అవార్డులు, 40 విశిష్ట సేవా పురస్కారాలకు ఆమోదం తెలిపారు. వీటిలో 4 కీర్తి చక్రలు, 15 వీర చక్రలు, 16 శౌర్య చక్రలు ఉన్నాయి. దేశ భద్రత పట్ల సైనిక దళాల అంకితభావం, నాయకత్వం, కర్తవ్యనిష్ఠ, సాంకేతిక నైపుణ్యాలకు ఈ పురస్కారాలు ప్రతీకలని గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.