Vempaty Kutumba Sastry: కృష్ణా జిల్లా పండితుడికి పద్మశ్రీ.. వెంపటి కుటుంబ శాస్త్రికి అరుదైన గౌరవం
ఈ వార్తాకథనం ఏంటి
దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 25న ప్రదానం చేయనున్నారు. ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 పద్మ అవార్డులను ప్రకటించింది. వీటిలో ఐదు పద్మ విభూషణ్, 13 పద్మ భూషణ్, 113 పద్మ శ్రీ అవార్డులు ఉన్నాయి. సాహిత్యం, విద్య విభాగంలో ఈసారి పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన వారిలో ప్రముఖ సంస్కృత పండితుడు వెంపటి కుటుంబ శాస్త్రి ఒకరు. సంస్కృత భాష అభివృద్ధికి, భారతీయ సంప్రదాయ జ్ఞాన వ్యవస్థల పరిరక్షణకు ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ గౌరవాన్ని ప్రకటించింది.
వివరాలు
బాల్యం నుంచే సంస్కృతంపై మక్కువ
వెంపటి కుటుంబ శాస్త్రి 1950 ఆగస్టు 12న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు గ్రామంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే సంస్కృతంపై ఆసక్తి పెంచుకున్న ఆయన ఉన్నత విద్యలోనూ అదే రంగాన్ని ఎంచుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి సంస్కృతంలో ఎంఏ విద్యాప్రవీణ పూర్తి చేశారు. అలాగే మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి శిరోమణి పట్టా పొందారు. తర్వాత రాష్ట్రీయ సంస్కృత సంస్థ నుంచి పీహెచ్‌డీ చేశారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో ఎంఏ, యోగాలో పీజీ డిప్లొమా కూడా పూర్తి చేశారు. అద్వైత వేదాంతం, దర్శనాలు, అలంకార శాస్త్రం, సంస్కృత సాహిత్యం, మాట్లాడే సంస్కృత భాష వంటి అంశాల్లో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది.
వివరాలు
కీలక పదవుల్లో సేవలు
వెంపటి కుటుంబ శాస్త్రి 1990 నుంచి 2004 నవంబర్ వరకు పుదుచ్చేరి కేంద్ర విశ్వవిద్యాలయంలో సంస్కృత విభాగాధిపతిగా, ప్రొఫెసర్‌గా పనిచేశారు. అనంతరం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని రాష్ట్రీయ సంస్కృత సంస్థ డైరెక్టర్‌గా 1999 నుంచి 2003 వరకు సేవలందించారు. అలాగే రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ డీమ్డ్ యూనివర్సిటీతో పాటు సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయంకి వైస్ ఛాన్సలర్‌గా 2003 మే నుంచి 2008 మే వరకు బాధ్యతలు నిర్వహించారు. సంస్కృత విద్యాభివృద్ధికి ఆయన చేసిన కృషికి విద్యావర్గాల్లో విశేష గుర్తింపు లభించింది.
వివరాలు
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు
సంస్కృత పరిశోధన రంగంలో వెంపటి కుటుంబ శాస్త్రికి అంతర్జాతీయ స్థాయిలోనూ మంచి పేరు ఉంది. 2006లో ఎడిన్‌బర్గ్‌లో జరిగిన 13వ ప్రపంచ సంస్కృత సదస్సులో ఆయనను ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సంస్కృత స్టడీస్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. తర్వాత క్యోటోలో 2009లో, న్యూఢిల్లీ లో 2012లో జరిగిన సదస్సులకు కూడా ఆయన అధ్యక్షత వహించారు. 17వ శతాబ్దానికి చెందిన ధర్మసూరి రచించిన'సాహిత్యరత్నాకర'పై విమర్శాత్మక సంపాదకత్వం, తులనాత్మక అధ్యయనం వంటి పరిశోధనలు చేశారు. ఇప్పటివరకు 11 పుస్తకాలు, 30కిపైగా పరిశోధనా వ్యాసాలు ప్రచురించారు.
వివరాలు
'పీపుల్స్ పద్మ'కు కేంద్రం ప్రాధాన్యం
2026లో కూడా కేంద్ర ప్రభుత్వం '#PeoplesPadma' భావనను ముందుకు తీసుకెళ్తోంది. దేశవ్యాప్తంగా గుర్తింపు లేని వ్యక్తులు, గ్రామీణ స్థాయిలో సమాజానికి సేవ చేసిన వారిని పద్మ అవార్డుల ద్వారా గౌరవిస్తోంది. కులం, వృత్తి, హోదా, లింగ భేదం లేకుండా వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. వెలుగులోకి రాని వ్యక్తుల సేవలకు గుర్తింపు ఇవ్వడమే 'పీపుల్స్ పద్మ' ప్రధాన ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.