Lithium Battery Industry: అనకాపల్లిలో.. రూ.8,175 కోట్లతో.. భారీ లిథియం బ్యాటరీ పరిశ్రమ
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. విద్యుత్ నిల్వ కోసం ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీల తయారీ యూనిట్‌ను 'వారీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్' సంస్థ అనకాపల్లి జిల్లా రాంబిల్లి ప్రాంతంలో ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టుకు రూ.8,175 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా, సుమారు 16 గిగావాట్ గంటల సామర్థ్యంతో లిథియం అయాన్ సెల్ తయారీ కేంద్రాన్ని నిర్మించేందుకు సంస్థ ముందుకొచ్చింది. ఈ పరిశ్రమలో సెల్, ప్యాక్, నిల్వ వ్యవస్థలకు అవసరమైన బ్యాటరీలను ఒకేచోట తయారు చేయనున్నారు. సెల్ తయారీ నుంచి ప్యాక్ తయారీ వరకు, విద్యుత్ నిర్వహణ సమగ్ర వ్యవస్థను ఒకేచోట ఏర్పాటు చేసే మొదటి సంస్థగా ఇది నిలవనుంది.
వివరాలు
క్లీన్ ఎనర్జీ రంగంలో ప్రత్యేక గుర్తింపు
ప్రాజెక్టు తొలి దశను 2027 జూలై నాటికి పూర్తి చేసి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ యూనిట్ ద్వారా సుమారు 3,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం దాదాపు 300 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ ప్రాజెక్టును విస్తరించడంతో భవిష్యత్తులో 20 గిగావాట్ గంటల సామర్థ్యంతో ఆధునిక రసాయన సెల్ బ్యాటరీలు, అంతే స్థాయిలో బ్యాటరీ ప్యాక్‌లు తయారు చేయాలన్నది సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా ఆధునిక రసాయన సెల్ బ్యాటరీలు మరియు బ్యాటరీ ప్యాక్‌ల తయారీపై సంస్థ దృష్టి సారిస్తోంది. భవిష్యత్తులో కొత్త విద్యుత్ నిల్వ సాంకేతికతలను కూడా పరిశీలించనుంది.
వివరాలు
గుజరాత్,అమెరికాలో సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్లు
ఈ సంస్థ ఇప్పటికే గుజరాత్ రాష్ట్రంతో పాటు అమెరికాలోని టెక్సాస్ ప్రాంతంలో సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్లను నిర్వహిస్తోంది. అమెరికా, కెనడా, ఇటలీ, తుర్కియే, వియత్నాం వంటి 30 దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. సోలార్ మాడ్యూల్ తయారీ నుంచి విద్యుత్ నిల్వ రంగానికి విస్తరించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌లో ఈ పరిశ్రమను ఏర్పాటు చేస్తోంది. దేశవ్యాప్తంగా ఈ తరహా ప్రాజెక్టులు చాలా కొద్దిగా మాత్రమే ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా యుటిలిటీ, గ్రిడ్, పునరుత్పాదక ఇంధన అనుసంధానం సులభమవుతుందని నిపుణులు భావిస్తున్నారు.