LOADING...
Mega Railway Terminals: హైదరాబాద్ చుట్టూ మెగా రైల్వే టెర్మినళ్ల ప్రణాళికలు..రైల్వేబోర్డుకు చేరిన ఫీజిబిలిటీ నివేదిక
రైల్వేబోర్డుకు చేరిన ఫీజిబిలిటీ నివేదిక

Mega Railway Terminals: హైదరాబాద్ చుట్టూ మెగా రైల్వే టెర్మినళ్ల ప్రణాళికలు..రైల్వేబోర్డుకు చేరిన ఫీజిబిలిటీ నివేదిక

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 30, 2026
09:33 am

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్ర రాజధానిలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్ల రద్దీ పెరుగుతుండటంతో సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ పరిసరాల్లో మెగా రైల్వే టెర్మినళ్ల ప్రణాళికలను రూపొందించింది. ఇందుకు అవసరమైన భూమి కేటాయింపుపై దృష్టి పెట్టింది. తూర్పు దిశలో నిర్మించిన చర్లపల్లి స్టేషన్ ఇప్పటికే వినియోగంలోకి వచ్చి, దానిని మరింత విస్తరించేందుకు సిద్ధమైంది. ఈ విస్తరణ కోసం 250 ఎకరాల భూమిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇతర దిశల్లో ప్రతిపాదించిన మూడు మెగా టెర్మినళ్ల కోసం కూడా భూమి అవసరమని తెలిపింది. మొత్తంగా 1,125 ఎకరాల వివాదరహిత భూమిని ఇవ్వాలని స్పష్టం చేసింది.

వివరాలు 

రద్దీని తగ్గించేందుకు నగర శివార్లలో కొత్త టెర్మినళ్ల ఏర్పాటు

ప్రస్తుతం సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ ప్రధాన స్టేషన్లుగా కొనసాగుతుండగా, తాజాగా చర్లపల్లి స్టేషన్ కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే ప్లాట్‌ఫారాలు సరిపోక దూరప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు స్టేషన్ల బయటే ఎక్కువసేపు నిలిచిపోతున్నాయి. ఈ రద్దీని తగ్గించేందుకు నగర శివార్లలో కొత్త టెర్మినళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఉత్తరం, పశ్చిమం, దక్షిణం దిశల నుంచి వచ్చే రైళ్లను ఆయా ప్రాంతాల టెర్మినళ్లకే పరిమితం చేయడం వల్ల ప్రధాన స్టేషన్లపై ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణ సమయం ఆదా అవడంతో పాటు నగరంలోని వేర్వేరు ప్రాంతాల ప్రజలకు దగ్గర్లోనే రైల్వే సదుపాయం లభిస్తుంది. ఇలాంటి విధానం ఇప్పటికే దిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, ముంబయి, చెన్నై నగరాల్లో అమల్లో ఉంది.

వివరాలు 

అధ్యయనానికి రూ.13.96 కోట్లు ఖర్చు

డబిల్‌పూర్, జుక్కల్, నాగులపల్లి ప్రాంతాల్లో ప్రతిపాదించిన మూడు మెగా టెర్మినళ్లపై సాధ్యాసాధ్యాల నివేదికను దక్షిణ మధ్య రైల్వే పూర్తి చేసి రైల్వే బోర్డుకు పంపింది. ఈ అధ్యయనానికి రూ.13.96 కోట్లు ఖర్చు చేసింది. మార్చి 11న తుది సర్వే నివేదికను సమర్పించింది. ఈ నేపథ్యంలో మూడు కొత్త టెర్మినళ్ల నిర్మాణం, చర్లపల్లి విస్తరణ కోసం కలిపి మొత్తం 1,125 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. కొత్త టెర్మినళ్ల ప్రణాళికలు ఇలా డబిల్‌పూర్‌ (ఉత్తర దిశలో)- 250 ఎకరాలు నాగులపల్లి (పశ్చిమంలో)- 325 ఎకరాలు జుక్కల్‌ (దక్షిణంలో)- 300 ఎకరాలు చర్లపల్లి విస్తరణ (తూర్పులో) 250 ఎకరాలు

Advertisement