LOADING...
CP Sajjanar: 21 వేల సినిమాలు, 50 లక్షల డేటా… పైరసీ సామ్రాజ్యాన్ని బట్టబయలు చేసిన పోలీసులు
21 వేల సినిమాలు, 50 లక్షల డేటా… పైరసీ సామ్రాజ్యాన్ని బట్టబయలు చేసిన పోలీసులు

CP Sajjanar: 21 వేల సినిమాలు, 50 లక్షల డేటా… పైరసీ సామ్రాజ్యాన్ని బట్టబయలు చేసిన పోలీసులు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 17, 2025
12:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ను చిత్రసీమకు చెందిన ప్రముఖులు కలిసి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అగ్రనటులు చిరంజీవి,నాగార్జునతో పాటు దర్శకుడు రాజమౌళి,నిర్మాత దిల్‌ రాజు పాల్గొన్నారు. ఇటీవల పైరసీ వెబ్‌సైట్‌ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఆ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ భేటీ జరిగినట్టు తెలుస్తోంది. భేటీ అనంతరం సజ్జనార్‌ మీడియాతో మాట్లాడారు. పైరసీ కారణంగా సినీ పరిశ్రమకు భారీ నష్టం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈసమస్యను అరికట్టే చర్యల్లో భాగంగా ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అతడి మీద ఐటీ యాక్ట్‌,కాపీరైట్‌ యాక్ట్‌ ప్రకారం మరో నాలుగు కేసులు కూడా నమోదు చేసినట్టు చెప్పారు.

వివరాలు 

పైరసీకి సంబంధించి ప్రశాంత్‌, శివరాజ్‌ అరెస్ట్‌ 

''ఇందుకు ముందు పైరసీకి సంబంధించి ప్రశాంత్‌, శివరాజ్‌ అనే వారిని కూడా అరెస్ట్‌ చేశాం. కానీ ఇమ్మడి రవి వల్ల సమాజానికే పెద్ద నష్టం జరిగింది.పైరసీ మాత్రమే కాకుండా బెట్టింగ్‌ యాప్‌లను కూడా ప్రోత్సహిస్తున్నాడు.వీటి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ఒక వెబ్‌సైట్‌ను బ్లాక్‌ చేస్తే వెంటనే కొత్త సైట్‌ తెరపైకి తీసుకొచ్చేవాడు. ఇలా మొత్తం 65 మిర్రర్‌ వెబ్‌సైట్లను నడిపాడు. అతడి హార్డ్‌డిస్క్‌లో 21 వేల సినిమాలు ఉన్నాయి .

వివరాలు 

రూ.3 కోట్ల  సీజ్

1972లో వచ్చిన గాడ్‌ఫాదర్‌ నుండి ఇటీవల విడుదలైన ఓజీ వరకు అన్నీ దొరికాయి. పైరసీ ద్వారా సుమారు రూ.20 కోట్లు ఆర్జించాడు. అందులో రూ.3 కోట్లను మేము సీజ్‌ చేశాం. దాదాపు 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల డేటా కూడా అతడి వద్ద ఉంది. ఇంత పెద్ద మొత్తంలో డేటా ఉండటం చాలా ప్రమాదకరం'' అని సజ్జనార్‌ వివరించారు.