
Period leave : మహిళలకు నెలసరి సెలవులపై స్మృతి ఇరానీ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలోని మహిళలకు నెలసరి సెలవులపై కేంద్ర స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు పీరియడ్స్ అనేవి సాధారణమే కానీ వైకల్యం కాదన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రభుత్వాలు, ఎంఎన్'సీ సంస్థలు నెలసరి సెలవులు (menstrual leave) ఇస్తున్నాయి.
ఈ క్రమంలో దేశంలోని మహిళా ఉద్యోగులకు ఈ సెలవులు ఇచ్చే అంశంపై చర్చ జరుగుతోంది. దీంతో మరోసారి స్మృతి ఇరానీ(Smriti Irani) ఈ అంశంపై స్పందించారు.
మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులు ఇచ్చే ప్రతిపాదనను కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ తిరస్కరించారు.
రాజ్యసభలో ఎంపీ మనోజ్ కుమార్ ఝా అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు.
DETAILS
ప్రభుత్వ పరిశీలనలో అలాంటివేం లేవు : కేంద్రమంత్రి స్మృతి ఇరానీ
మహిళకు నెలసరి వైకల్యం కాదని, జీవితంలో అదో సహజ ప్రక్రియ అన్నారు. నెలసరి సెలవులు పని ప్రదేశంలో వివక్షకు దారితీయొచ్చన్నారు.
ఇదే సమయంలో నెలసరి సమయంలో పాటించాల్సిన శుభ్రతపై సర్కారు ప్రత్యేక దృష్టిసారించిందన్నారు.
ఇందులో భాగంగానే కేంద్ర ఆరోగ్య శాఖ ముసాయిదా తీర్మానాన్ని రూపొందించిందన్నారు. ఫలితంగా మహిళల్లో చైతన్యం కలిగించడమే లక్ష్యమన్నారు.
10-19 ఏళ్ల అమ్మాయిల్లో వివిధ కార్యక్రమాల ద్వారా నెలసరి శుభ్రతపై అవగాహన కల్పించేందుకు ఇప్పటికే 'ప్రమోషన్ ఆఫ్ మెన్‌స్ట్రువల్ హైజీన్ మేనేజ్‌మెంట్(ఎంహెచ్‌ఎం) స్కీమ్' అమల్లో ఉందని గుర్తు చేశారు.
అన్ని సంస్థల్లో వేతనంతో కూడిన నెలసరి సెలవును తప్పనిసరి అనే ప్రతిపాదనలు ప్రస్తుతానికి ప్రభుత్వ పరిశీలనలో లేవని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు.