LOADING...
Rain Alert : తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం
నేడు ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం

Rain Alert : తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 08, 2025
09:06 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్ర వాతావరణ శాఖ ఒక కీలక హెచ్చరికను జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం వరంగల్ జిల్లాలో కుండపోత వర్షం కురిసింది.భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జి పరిధిలో భారీ వరద నీరు నిలవడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ పరిస్థితిలో రెండు ఆర్టీసీ బస్సులు వరద నీటిలో చిక్కుకుపోయాయి.

వివరాలు 

 ఖమ్మం జిల్లాలో  భారీ వర్షం 

పోలీసులు,రెస్క్యూ బృందాలు వెంటనే చేరుకుని తాళ్ల సహాయంతో వారిని సురక్షితంగా బయటకు లాగారు. అలాగే, ఖమ్మం జిల్లాలో కూడా అనేక ప్రదేశాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. మళ్లీ వచ్చే మూడు రోజుల్లో రాష్ట్రంలో అనేక ప్రదేశాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. సోమవారం ఉదయం నుంచి రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్ధిపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

వివరాలు 

విద్యుత్ స్థంభాల సమీపంలో ఉండకండి: వాతావరణ శాఖ అధికారులు

కొన్ని ప్రదేశాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కూడా కురిసే అవకాశముందని అధికారులు వివరించారు. అలాగే గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయని హెచ్చరించారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. . వర్షాలు పడుతున్న సమయంలో రైతులు, వ్యవసాయ కూలీలు తాము పంటలకు, వ్యక్తిగత రక్షణకు అవసరమైన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని అధికారులు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా చెట్ల క్రింద, విద్యుత్ స్థంభాల సమీపంలో ఉండడం మానుకోవాలని వారిని హెచ్చరించారు.