Telangana: తెలంగాణలో వాయుగుండం ప్రభావం.. పలు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో గత వారం రోజులుగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటడంతో పాటు నైరుతి రుతుపవనాలు చురుకుగా కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మరిన్ని భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో పలు జిల్లాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.నైరుతి రుతుపవనాల సీజన్‌లో తొలి రుతుపవన వాయుగుండం ఆదివారం ఉదయం ఏర్పడి,అదే రోజు రాత్రికి ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో తీరం దాటింది. రాబోయే 24 గంటల్లో ఈ వ్యవస్థ ఉత్తర ఒడిశా,ఛత్తీస్‌గఢ్ వైపు కదిలే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
వివరాలు
ఈ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం
వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారగా, దాని ప్రభావం తెలంగాణపైనా కనిపించే అవకాశం ఉందని తెలిపారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం సోమవారం అదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముండటంతో ప్రజలు అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని, చెట్లు, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలవకుండా సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు.
వివరాలు
హైదరాబాద్‌లోనూ సోమవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనూ సోమవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. నగరంలో రోజంతా ఆకాశం మేఘావృతంగా ఉండే అవకాశం ఉంది. పగటిపూట తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు కురిసే అవకాశం సుమారు 45 శాతం ఉండగా, రాత్రి వేళల్లో అది 10 శాతానికి తగ్గే అవకాశముందని అధికారులు తెలిపారు. అయినప్పటికీ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.