Rain Alert : దూసుకొస్తున్న భారీ ముప్పు.. బంగాళాఖాతంలో రెండు వాయుగుండాలు.. ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు..
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ హెచ్చరిక. రాష్ట్రంలో వర్షాలు దంచికొట్టబోతున్నాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒక వాయుగుండం కొనసాగుతుండగా, త్వరలో మరొకటి ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ పరిస్థితులు సూచిస్తున్నాయి. మలక్కా జలసంధి పరిసరాల్లో ఉన్న తీవ్ర అల్పపీడనం మంగళవారం ఉదయం వాయుగుండ స్థాయికి చేరుకున్నది. ఇది ఇంకా బలపడి ముందుగా వచ్చే 24 గంటల్లో పశ్చిమ దిశగా, తర్వాతి 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనావేసింది. ఇదే వ్యవస్థ తుపానుగా మారే అవకాశాలు కూడా గణనీయంగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
వివరాలు
శ్రీలంక-భూమధ్యరేఖ సమీపంలో మరో అల్పపీడనం
ఈ వ్యవస్థ ఏ దిశగా కదులుతుందో, ఎక్కడ తీరాన్ని తాకుతుందో వంటి ముఖ్య వివరాలు మరో రెండు రోజుల్లో స్పష్టమవుతాయని తెలిపారు. శనివారం లేదా ఆదివారం నాటికి తుపాను తమిళనాడు-ఏపీ తీరాల వైపు కదిలే అవకాశం ఉన్నప్పటికీ, అది సముద్రంలోనే బలహీనపడే అవకాశం కూడా ఉన్నట్లు సూచిస్తున్నారు. ఇక మరోవైపు,నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక-భూమధ్యరేఖ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ బుధవారానికి తీవ్ర అల్పపీడనంగా మారి, ఆ తర్వాత 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ వాయుగుండం మరింత శక్తివంతమై ఉత్తర తమిళనాడు వైపు కదిలే అవకాశముండటంతో, ఏపీ-తమిళనాడు రాష్ట్రాల పలు ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.
వివరాలు
మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని అధికారులు సూచనలు జారీ
ఈ వాయుగుండం ప్రభావంతో ఈ నెల 29వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. శనివారం (29వ తేదీ)ప్రకాశం,నెల్లూరు,వైఎస్ఆర్ కడప,అన్నమయ్య,తిరుపతి,చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం (30వ తేదీ) ప్రకాశం,నెల్లూరు,కడప,అన్నమయ్య,తిరుపతి,చిత్తూరు జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, శ్రీసత్యసాయి,నంద్యాల,బాపట్ల,పల్నాడు,గుంటూరు, కృష్ణా,ఎన్టీఆర్,ఏలూరు,పశ్చిమగోదావరి జిల్లాల్లో కూడా భారీవర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తీవ్ర వర్షాల సమయంలో బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉందని,సముద్రంలో అలలు తీవ్రంగా ఉద్ధృతమవుతాయని సూచించారు. అందుకే గురువారం నుంచే మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరిక కేంద్రం అధికారులు సూచనలు జారీ చేశారు.