Hyderbad Metro: మెట్రో టేకోవర్ ప్రక్రియ వేగవంతం.. బోర్డు నియామకాల్లో స్పీడ్
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ తొలి దశ స్వాధీన ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (PPP) విధానంలో అమలైన ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావడానికి కీలక నిర్ణయాలు వరుసగా తీసుకుంటోంది. ఈ క్రమంలో ఎల్ అండ్ టీ మెట్రో రైలు (హైదరాబాద్) లిమిటెడ్లోని 100 శాతం ఈక్విటీ వాటాల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసింది. వాటాల కొనుగోలు అనంతరం సంస్థ బోర్డు నిర్వహణ కోసం ప్రభుత్వం కీలక అధికారులను నామినేట్ చేసింది. దీనికి సంబంధించి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
వివరాలు
ఈ లావాదేవీలను ఈనెల 30లోగా పూర్తి చేయాలి
ప్రభుత్వ ఆదేశాల మేరకు సుమారు రూ.15 వేల కోట్ల వ్యయంతో (అప్పులు సహా) ఎల్ అండ్ టీ మెట్రో రైలు సంస్థను స్వాధీనం చేసుకోవాలని హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్కు సూచించింది. ఈ లావాదేవీని ఈ నెల 30వ తేదీ లోపు పూర్తి చేయాలని గడువు నిర్ణయించింది. స్వాధీనం ప్రక్రియ పూర్తయ్యాక బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ నియామకం, నామినీ షేర్‌హోల్డర్లకు షేర్ల కేటాయింపు కోసం హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు సమర్పించారు. వాటిని సమగ్రంగా పరిశీలించిన ప్రభుత్వం, కొత్త బోర్డు ఆఫ్ డైరెక్టర్స్‌ను నామినేట్ చేసింది. ఈ కొత్త బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావును ఛైర్మన్‌గా నియమించనున్నారు.
వివరాలు
డైరక్టర్లుగా ఎనిమిది మంది
అలాగే, ప్రభుత్వం కూడా నామినీ షేర్‌హోల్డర్‌గా భాగస్వామ్యం ఉంటుంది. ఛైర్మన్, ఎండీ, నలుగురు డైరెక్టర్లకు తెలంగాణ ప్రభుత్వ తరఫున నామమాత్రంగా ఒక్కో షేరు కేటాయించగా, మిగతా షేర్లన్నింటినీ హెచ్‌ఎంఆర్‌ఎల్ కలిగి ఉంటుందని స్పష్టం చేసింది. ఇక బోర్డు నిర్మాణంలో ఛైర్మన్, ఎండీతో పాటు మొత్తం ఎనిమిది మంది డైరెక్టర్లు ఉంటారు. ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్ (హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ) కొనసాగుతారు. డైరెక్టర్లుగా జయేశ్ రంజన్ (పురపాలక శాఖ), వికాస్ రాజ్ (ఆర్ & బీ), సందీప్ కుమార్ సుల్తానియా (ఆర్థికశాఖ), బి. శివధర్ రెడ్డి (డీజీపీ), సర్ఫరాజ్ అహ్మద్ (హెచ్‌ఎండీఏ కమిషనర్), కె. అశోక్ రెడ్డి (జలమండలి ఎండీ), జితేశ్ వి పాటిల్ (ఎస్పీడీసీఎల్ సీఎండీ), శివేంద్ర ప్రతాప్ (హెచ్‌ఎంఆర్‌ఎల్ జేఎండీ)లను ప్రభుత్వం నియమించింది.