
Old City Metro : జోరుగా ఓల్డ్ సిటీలో మెట్రో పనులు.. సీఎం ఆదేశాలతో వేగవంతం
ఈ వార్తాకథనం ఏంటి
ఎంజీబీఎస్ - చంద్రాయణగుట్ట మెట్రో విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
మొత్తం 7.5 కిలోమీటర్ల పొడవుతో ఈ మార్గంలో విస్తరణ పనులు జోరుగా సాగుతున్నాయని, ప్రజల సహకారంతో ప్రభావిత ఆస్తుల స్వాధీనం, కూల్చివేతలు సవ్యంగా జరుగుతున్నాయని వివరించారు.
ఇప్పటివరకు 205 ఆస్తుల యజమానులకు నష్టపరిహారంగా రూ. 212 కోట్లు చెల్లించామని, వారికీ చెక్కుల పంపిణీ పూర్తయ్యిందని తెలిపారు.
మార్గంలో ఎదురైన విద్యుత్, టెలిఫోన్ లైన్ల వంటి క్లిష్టమైన సాంకేతిక సమస్యలను అప్రమత్తంగా పరిష్కరించామని వెల్లడించారు.
Details
భవనాలను కూల్చివేసి, అవశేషాలను తొలగించాం
మెట్రో, రెవెన్యూ, పోలీసు శాఖల పర్యవేక్షణలో చురుకుగా కొనసాగుతున్నాయని, భూమి యజమానులు స్వచ్ఛందంగా తమ ఆస్తులను ఇచ్చి ప్రభుత్వానికి సహకరిస్తున్నారని తెలిపారు.
ఇప్పటికే రోడ్డు విస్తరణ అవసరానికి అనుగుణంగా చాలా భవనాలను కూల్చివేసి, అవశేషాలను తొలగించామని చెప్పారు.
రంజాన్ సందర్భంగా పనులు కొద్దిగా నెమ్మదించాయని, ప్రస్తుతం మరలా వేగం పుంజుకున్నాయని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పాతనగర విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేసి, కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించిన వెంటనే మెట్రో నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు.