Abhishek Banerjee: అభిషేక్ బెనర్జీ ఇంట్లో అర్ధరాత్రి సోదాలు.. టీఎంసీలో కలకలం
ఈ వార్తాకథనం ఏంటి
టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ నివాసంలో శుక్రవారం రాత్రి పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. భూ కుంభకోణానికి సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా కోల్‌కతాలోని కాళీఘాట్‌లో ఉన్న ఆయన నివాసానికి అధికారులు చేరుకున్నారు. సల్బోని ప్రాంతంలోని భూమి వ్యవహారానికి సంబంధించిన కేసులో నిందితుడిగా ఉన్న అభిషేక్ బెనర్జీ అనుచరుడి కోసం గాలిస్తున్నట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో అభిషేక్ నివాసంలో నాలుగు గంటలకు పైగా సోదాలు నిర్వహించినట్లు వెల్లడించారు.
వివరాలు
ఇంటి తాళం పగలుకొట్టిన భద్రతా బలగాలు
అయితే, ఈ తనిఖీల సందర్భంగా కేంద్ర భద్రతా బలగాలు ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించాయని టీఎంసీ వర్గాలు ఆరోపించాయి. పోలీసులతో పాటు కేంద్ర భద్రతా బలగాలు కూడా ఈ ఆపరేషన్‌లో పాల్గొనడంతో టీఎంసీ కార్యకర్తలు పెద్దఎత్తున నిరసనకు దిగారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ చర్యలు చేపట్టారని విమర్శించారు. ఈ ఆపరేషన్ విషయం తెలుసుకున్న వెంటనే టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హుటాహుటిన అభిషేక్ బెనర్జీ నివాసానికి చేరుకున్నారు.
వివరాలు
టీఎంసీ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ దాడులు
మరోవైపు, మున్సిపాలిటీ నియామకాల కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్ర నివాసంపై సోదాలు నిర్వహించారు. కామర్‌హతి మున్సిపాలిటీతో పాటు పలు మున్సిపాలిటీల్లో ఉద్యోగ నియామకాల సందర్భంగా అనర్హులైన అభ్యర్థులను నియమించినట్లు ఈడీ ఆరోపించింది. ఇందుకు ప్రతిఫలంగా భారీ మొత్తంలో నగదు, బంగారం స్వీకరించినట్లు దర్యాప్తులో తేలినట్లు తెలిపింది. సోదాల సందర్భంగా మదన్ మిత్ర ఇంట్లోని మంచం కింద దాచిపెట్టిన నగదు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.