Andhrapradesh : వ్యాను ఢీ కొట్టిన లారీ.. బయటపడ్డ 7 కోట్ల నగదు
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రూ.7 కోట్ల నగదు లభ్యమైంది. నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద మినీ వ్యాను ను లారీ ఢీకొట్టడంతో వ్యాను బోల్తా పడింది. ఆ వాహనంలో తవుడు బస్తాల మధ్య 7 అట్టపెట్టెల్లో నగదు పెట్టి తరలిస్తున్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నగదు మొత్తం స్వాధీనం చేసుకోగా, వాటిని లెక్కించగా మొత్తం రూ.7 కోట్లుగా తేలింది. సమాచారం ప్రకారం వాహనం విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో వాహనం డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం గోపాలపురం ఆస్పత్రిలో చేర్పించారు.
నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఫ్లయింగ్ స్క్వాడ్ సహాయంతో పోలీసులు నగదును స్వాధీనం చేసుకుని లెక్కించారు. అయితే ఆ డబ్బు ఎవరిది, ఎవరు పంపిస్తున్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడడం ఆంధ్రప్రదేశ్‌లో ఇదే మొదటిసారి కాదు. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు నాలుగో దశలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. అంతకుముందు మే 10న ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లాలో పోలీసుల తనిఖీల్లో పైపులతో కూడిన ట్రక్కులో సుమారు రూ.8 కోట్లను పోలీసులు గుర్తించారు. ఎన్టీఆర్ జిల్లా గరికపాడు చెక్‌పోస్టు వద్ద తనిఖీల్లో ఈ నగదు పట్టుబడింది. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కమిషన్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి.