Page Loader
Anagani Satyaprasad: అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచబోం: మంత్రి అనగాని
అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచబోం: మంత్రి అనగాని

Anagani Satyaprasad: అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచబోం: మంత్రి అనగాని

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 27, 2025
03:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

గత ప్రభుత్వంలో జరిగిన భూ అరాచకాల వల్ల ప్రజలు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొన్నారని, రెవెన్యూ సదస్సుల ద్వారా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ అన్నారు. సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామని ఆయన వివరించారు. పేదల భూముల వివరాలను మార్చేందుకు ప్రయత్నించిన అధికారులపై కఠినచర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియాసమావేశంలో మంత్రి మాట్లాడుతూ,సింహాచలం పంచగ్రామాల భూముల సమస్యను కేబినెట్‌లో చర్చించి తక్షణమే పరిష్కరించేందుకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రిజిస్ట్రేషన్ విలువల హేతుబద్ధీకరణ కూడా త్వరలో చేపడతామని ఆయన పేర్కొన్నారు. గుంటూరు,మార్కాపురం వంటి ప్రాంతాల్లో బుక్ వాల్యూ తక్కువగా ఉందని,కొన్ని చోట్ల తగ్గిస్తే మరికొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ విలువలు పెంచే అవకాశం ఉందని వివరించారు.

వివరాలు 

'యువగళం' పాదయాత్రకు నేటితో రెండేళ్లు

అలాగే, నాలా పన్ను కూడా రేషనలైజ్‌ చేస్తున్నామని తెలిపారు. గ్రోత్ కారిడార్లలో రిజిస్ట్రేషన్ విలువలను పెంచుతామని పేర్కొన్నారు. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలను పెంచకూడదని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయని మంత్రి తెలిపారు. దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబును అనేక మంది పారిశ్రామికవేత్తలు కలిసి పెట్టుబడులపై హామీ ఇచ్చారని అన్నారు. వైసీపీ నిర్బంధాలకు వ్యతిరేకంగా లోకేశ్ నిర్వహించిన 'యువగళం' పాదయాత్రకు నేటితో రెండేళ్లు పూర్తయిందని గుర్తుచేశారు. జగన్ ప్రభుత్వ అడ్డంకులను అధిగమించి లోకేశ్ పాదయాత్రను విజయవంతంగా పూర్తిచేశారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతుందని స్పష్టం చేశారు.