LOADING...
Minister lokesh: అమరావతిలో క్రియేటివ్‌ ల్యాండ్‌ ప్రాజెక్టు.. రెండేళ్లలో పనులు ప్రారంభించేందుకు అంగీకారం
రెండేళ్లలో పనులు ప్రారంభించేందుకు అంగీకారం

Minister lokesh: అమరావతిలో క్రియేటివ్‌ ల్యాండ్‌ ప్రాజెక్టు.. రెండేళ్లలో పనులు ప్రారంభించేందుకు అంగీకారం

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 10, 2025
08:27 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా పర్యటనలో భాగంగా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్‌ వివిధ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో వరుసగా సమావేశాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించి,నిర్ణీత కాలంలో పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు అందించేలా ప్రత్యేక ఎస్క్రో ఖాతాను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుగా మారాలని సంస్థలను ఆహ్వానించారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా అమరావతిలో ప్రతిపాదిత'క్రియేటివ్‌ ల్యాండ్‌' ప్రాజెక్టును వేగంగా ప్రారంభించాలని కంపెనీ ఫౌండర్‌ సజన్‌రాజ్‌ కురుప్‌, సీనియర్‌ పార్ట్‌నర్‌ ఇయాంగ్‌ కాపింగ్‌,అమెరికన్‌ సినీ దర్శకుడు షిక్‌ రసెల్‌ను మంత్రి కోరారు. అమరావతిని ఏఐ ఆధారిత వర్చువల్‌ స్టూడియోలు,ఏఆర్‌,వీఆర్‌ థీమ్‌పార్కులతో కూడిన ఆధునిక ట్రాన్స్‌మీడియా హబ్‌గా తీర్చిదిద్దే ప్రక్రియలో సంస్థ చురుకైన భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు.

వివరాలు 

లక్షన్నర మంది యువతకు ఉపాధి అవకాశాలు

దీనికి స్పందించిన సంస్థ ప్రతినిధులు గత ఏడాది మేలో ప్రభుత్వంతో చేసిన ఒప్పందం ప్రకారం రెండేళ్ల వ్యవధిలో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలైతే దాదాపు రూ.10,000 కోట్ల మేర పెట్టుబడులు రానూ, సుమారు లక్షన్నర మంది యువతకు ఉపాధి అవకాశాలు కలగనున్నాయని వివరించారు. అమరావతిలో శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో క్రియేటివ్‌ ల్యాండ్‌ ఆసియాతో కలిసి భాగస్వామిగా పనిచేసే అంశంపై కాన్వా సంస్థను మంత్రి లోకేశ్‌ ఆహ్వానించారు. కాన్వా చీఫ్‌ కస్టమర్‌ సక్సెస్‌ అధికారి రోబ్‌ గిగిలియో, ఎడ్యుకేషన్‌ అండ్‌ పబ్లిక్‌ సెక్టార్‌ విభాగాధిపతి జాసన్‌ విల్‌ మాట్‌లతో ఈ విషయమై చర్చించారు.

వివరాలు 

190కు పైగా దేశాల్లో కాన్వా కార్యకలాపాలు 

190కు పైగా దేశాల్లో కాన్వా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు సంస్థ ప్రతినిధులు చెప్పగా, ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనలను తమ సీనియర్‌ నాయకత్వ బృందంతో సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అమరావతిలో ఆటోడెస్క్‌ డిజైన్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ అకాడమీని నెలకొల్పేందుకు సహకరించాలని ఆటోడెస్క్‌ సంస్థ ముఖ్య టెక్నాలజిస్టు దేవ్‌ పటేల్‌, సీనియర్‌ డైరెక్టర్‌ అలిసన్‌ రోజ్‌లను మంత్రి కోరారు. బీఐఎం సాంకేతికత ఆధారంగా అమరావతి రూపుదిద్దుకుంటోందని, ఈ నేపథ్యంలో డిజిటల్‌ ఫ్యాబ్రికేషన్‌, సుస్థిర డిజైన్‌ రంగాల్లో శిక్షణ, పరిశోధనలకు విస్తృత అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

Advertisement

వివరాలు 

దేశంలోనే తొలి 'క్వాంటమ్‌ రెడీ స్టేట్‌'గా ఆంధ్రప్రదేశ్ 

తీరప్రాంతంలో తరచుగా సంభవించే తుపాన్ల ప్రభావాలను తట్టుకునేలా భవనాల నిర్మాణానికి ఆటోడెస్క్‌ సీఎఫ్‌డీ (కంప్యూటేషనల్‌ ఫ్లూయిడ్‌ డైనమిక్స్‌) సాంకేతిక సహకారంతో సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌ల రూపకల్పన చేయాల్సి ఉందని వివరించారు. ఈ ప్రతిపాదనపై అంతర్గతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అదేవిధంగా అమరావతిలో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని కూడా మంత్రి లోకేశ్‌ ముందుంచారు. ఈ మేరకు రిగెట్టి కంప్యూటింగ్‌ సంస్థ చీఫ్‌ టెక్నాలజీ అధికారి డేవిడ్‌ రివాస్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో అమలవుతున్న డిజిటల్‌ మౌలిక వసతుల ప్రాజెక్టులో రిగెట్టి క్లౌడ్‌ క్వాంటమ్‌ వ్యవస్థలను అనుసంధానించి, ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే తొలి 'క్వాంటమ్‌ రెడీ స్టేట్‌'గా తీర్చిదిద్దేందుకు సహకరించాలని మంత్రి కోరారు.

Advertisement