
Amaravati: మూడేళ్లలో రాజధానిని నిర్మించి.. విమర్శకుల నోళ్లు మూయిస్తాం: పొంగూరి నారాయణ
ఈ వార్తాకథనం ఏంటి
అమరావతిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మూడేళ్లలో పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరి నారాయణ ప్రకటించారు. వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి అమరావతి ప్రాంతంలోని కాలువలు, రిజర్వాయర్లు వంటి నిర్మాణాల పనులు ముగించడమే కాకుండా, వచ్చే మార్చి నాటికి 4,000 గృహ సముదాయాల తుదిదశ పనులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అమరావతికి వ్యతిరేకంగా ఎన్ని కుట్రలు జరిగినా, ఎన్ని విమర్శలు వచ్చినా వాటిని ఎదుర్కొంటూ అభివృద్ధిని పూర్తి చేస్తామని నారాయణ స్పష్టం చేశారు. మంగళవారం మంత్రి నారాయణ అమరావతిలో పర్యటించారు.ఈ పర్యటనలో ఆయనతో పాటు అమరావతి అభివృద్ధి సంస్థ (ADC) ఛైర్‌పర్సన్ లక్ష్మీ పార్థసారథి, CRDA ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వివరాలు
అమరావతి అభివృద్ధిని విమర్శిస్తున్నవారికి జవాబు ఇచ్చే విధంగా పనిచేస్తాం
నర్సరీ, పార్కు ప్రాంతం, కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్, శాఖమూరు రిజర్వాయర్‌ను సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను సమీక్షించారు. మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ... "రాజధానిలో అభివృద్ధి జరిగట్లేదని విమర్శించే వారి నోళ్లు మూయించేలా, సమయానికి పనులను పూర్తి చేస్తాం. ముంపు నివారణ కోసం డచ్ (నెదర్లాండ్స్) నిపుణుల సహకారంతో కాలువల డిజైన్లను తయారుచేశాం. కొండవీటి వాగును 23.6 కిలోమీటర్ల మేర, పాలవాగును 16.5 కిలోమీటర్లు, గ్రావిటీ కెనాల్‌ను 7.843 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేస్తుండగా, మొత్తం 47.94 కిలోమీటర్ల మేర విశాలమైన కాలువలను నిర్మిస్తున్నాం" అని వివరించారు.
వివరాలు
వివిధ ప్రాంతాల్లో నీటిని నిల్వ చేసే రిజర్వాయర్ల నిర్మాణం
శాఖమూరు రిజర్వాయర్‌ను 50 ఎకరాల్లో 0.03 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నామని, అదే విధంగా కృష్ణాయపాలెం రిజర్వాయర్‌ను 190 ఎకరాల్లో 0.1 టీఎంసీల సామర్థ్యంతో, నీరుకొండ రిజర్వాయర్‌ను 440 ఎకరాల్లో 0.4 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఇవి ముంపు నివారణకు కీలకంగా ఉపయోగపడతాయని వివరించారు.
వివరాలు
భూమి ఇచ్చిన ప్రతి రైతుకు కౌలు చెల్లిస్తాం
రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులందరికీ కౌలు చెల్లిస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. ఈ ఏడాది మొత్తం 25,000 మంది రైతులకు కౌలు చెల్లించాల్సి ఉండగా, వివిధ సాంకేతిక లేదా వ్యక్తిగత కారణాల వల్ల 7,000 మంది రైతులకు అది నిలిచిపోయిందన్నారు. కానీ ఇప్పటివరకు వారందరికీ కౌలు మొత్తాన్ని జమ చేశామని వెల్లడించారు. ఇంకా అందని వారికి CRDA అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేసుకునే అవకాశముందని చెప్పారు.
వివరాలు
సింగపూర్‌తో సంబంధాల్లో తిరిగి నమ్మకం ఏర్పడింది
గత ప్రభుత్వ హయాంలో సింగపూర్‌పై విచారణ జరిపే ఉద్దేశంతో అక్కడకు సీఐడీ అధికారులను పంపడం వల్ల ఆ దేశంతో రాష్ట్రానికి ఉన్న అనుబంధాలు దెబ్బతిన్నాయని మంత్రి అన్నారు. అయితే ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్‌కు చేసిన పర్యటనతో పరిస్థితి మారిందని, ఆయనపై అక్కడి ప్రభుత్వానికి విశ్వాసం ఏర్పడిందని తెలిపారు. ఇంజినీర్లు, గుత్తేదారుల సమీక్షతో పనుల వేగం పెరుగుతోంది ఈ కార్యక్రమంలో CRDA ఈఎన్సీ గోపాలకృష్ణారెడ్డి, సీఈ ధనుంజయ్‌తో పాటు రాజధాని నిర్మాణ పనులకు బాధ్యత వహిస్తున్న గుత్తేదారు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. పనుల ప్రగతిని సమీక్షించి, మరింత వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు.
వివరాలు
శాఖమూరు రిజర్వాయర్ పనులు వేగంగా సాగుతున్నాయి
వరద ముంపు నివారణ కోసం నిర్మిస్తున్న శాఖమూరు రిజర్వాయర్ పనులు ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్నాయని అధికారవర్గాలు తెలిపాయి. 50 ఎకరాల విస్తీర్ణంలో 0.3 టీఎంసీల సామర్థ్యం గల ఈ జలాశయం ద్వారా, కొండవీటి వాగులో నుంచి వచ్చే వరదనీరు ముందుగా నీరుకొండ రిజర్వాయర్‌కు వెళ్లి అక్కడి నుంచి శాఖమూరులోకి చేరుతుందని వెల్లడించారు.