Roja: నేను జగనన్న సైనికురాలిని.. నగిరి టికెట్ ఎవరికిచ్చినా అభ్యంతరం లేదు: రోజా
వచ్చే అసెంబ్లీ ఎన్నిక్లలో నగరి ఎమ్మెల్యే టికెట్‌ను మంత్రి రోజాకు కాకుండా మరొకరికి ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారంపై తాజాగా రోజా స్పందించారు. మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా కాసేపు దర్శనానంతరం మీడియాతో మాట్లాడారు. నగరి ఎమ్మెల్యే టికెట్ తనకు ఇవ్వకుండా ఆ రెండు పత్రికల యాజమానులకు ఇస్తారా? అని రోజా ప్రశ్నించారు. తనకు టికెట్ ఇవ్వరన్న శునకానందం కొద్దికాలం మాత్రమే అని రోజా అన్నారు. ఒకవేళ నగరి టికెట్ తనకు ఇవ్వకున్నా.. ఎవరికి ఇచ్చినా.. పర్వాలేదని, తాను జగనన్న సైనికుడినని రోజా పేర్కొన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో వైసీపీ 175 స్థానాలకు 175 సీట్లను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
టీడీపీకి 175 స్థానాల్లో అభ్యర్థులు లేరు: రోజా
తెలుగు దేశం పార్టీపై కూడా రోజా విమర్శలు చేశారు. టీడీపీకి 175 స్థానాల్లో నిలబడే అభ్యర్థులు లేరన్నారు. వైసీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్లను పార్టీలో చేర్పించుకొని సీట్లు ఇవ్వాలని చంద్రబాబు చూస్తున్నట్లు విమర్శించారు. ఇదిలా ఉంటే.. వచ్చే ఎన్నికల్లో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోది. ఇప్పటికే నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌చార్జ్‌లను సీఎం జగన్ మార్చారు. జగన్ పక్కన పెట్టే ఎమ్మెల్యేల జాబితాలో రోజా కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారంలో నిజం ఎంత ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.