గిరిజన హక్కులపై 'యూనిఫాం సివిల్ కోడ్' ప్రభావం ఉండదు: కేంద్రమంత్రి బఘేల్
యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)పై బుధవారం కేంద్రమంత్రి సత్యపాల్ సింగ్ బఘెల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈశాన్య రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో గిరిజనుల హక్కులు, ఆచార వ్యవహారాలపై యూసీసీ ఎలాంటి ప్రభావం చూపదని కేంద్రమంత్రి అన్నారు. ప్రస్తుతం సత్యపాల్ సింగ్ బఘెల్ ఆరోగ్య శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. గిరిజన వర్గాల వైవిధ్యం, సంస్కృతిని బీజేపీ గౌరవిస్తుందని, వారి ప్రయోజనాలకు విరుద్ధంగా ఎలాంటి చట్టాన్ని అమలు చేయబోదని బఘెల్ చెప్పారు.
ఈశాన్య రాష్ట్రాల ఆచారాలను గౌరవిస్తాం: బఘెల్
గిరిజన మహిళ ద్రౌపది ముర్మును బీజీపీ భారత రాష్ట్రపతిని చేసినట్లు బఘెల్ పేర్కొన్నారు. అలాగే అత్యధిక సంఖ్యలో గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, మంత్రులు బీజేపీ ఉన్నారని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల ఆచారాలను తమ పార్టీ గౌరవిస్తుందని, తామకు ఎటువంటి మతపరమైన, సామాజిక ఆచారాలను దెబ్బతీసే అవకాశం లేదన్నారు. బుజ్జగింపు రాజకీయాలు కూడా సరైనవి కావన్నారు. రాజ్యాంగంలోని షెడ్యూల్ 6 ప్రకారం అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరంలలోని కొన్ని గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక నిబంధనలను మంజూరు చేసినట్లు వివరించారు. ఇతర రాష్ట్రాల గిరిజనుల విషయానికొస్తే, ఏదైనా చట్టం చేసే ముందు వారిని కూడా సంప్రదించి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని ఆయన తెలిపారు.