Telangana: భవనాలు, లే అవుట్ల అనుమతులకు 'బిల్డ్ నౌ' పేరుతో కొత్త ఆన్‌లైన్ విధానం
తెలంగాణ ప్రభుత్వం 'బిల్డ్ నౌ' పేరుతో కొత్త ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా భవనాల నిర్మాణం, లే అవుట్ల అనుమతుల ప్రక్రియ సులభం అవుతుంది. ఈ ఆన్‌లైన్ విధానాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు మంగళవారం ప్రారంభించారు.
కొత్త విధానాలతో పథకాల అమలు
''పట్టణాభివృద్ధిలో కొత్త తరహా కార్యక్రమాలను చేపట్టినట్లు సర్వత్రా గమనిస్తున్నాం. రాష్ట్రంలో 60 శాతం మందికి పైగా ప్రజలు పట్టణాల,నగరాల ప్రాంతాలలో నివసిస్తున్నారు, కాబట్టి ఈ శాఖపై ప్రత్యేక దృష్టి పెడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నారు. రాష్ట్రంలో వ్యాపార ప్రవర్తనకు అనుకూలమైన వాతావరణం సృష్టిస్తున్నాం. గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన అభివృద్ధి విధానాలను కొనసాగిస్తూ, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటున్నాం. కొత్త విధానాలతో ఎన్నడూ లేని విధంగా పథకాలను అమలు చేస్తున్నాం. స్థిరాస్తి రంగంలో హైదరాబాద్ ఇప్పటికీ టాప్ స్థానంలో ఉంది, ఇక్కడి ప్రజలు గృహ రుణాలు అత్యధికంగా తీసుకుంటున్నారు'' అని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు.