Page Loader
Uttar Pradesh: కాన్పూర్‌లో అగ్గిపెట్టెతో ఆడుకుంటూ.. నాలుగు కుక్కపిల్లలను కాల్చిన మైనర్ బాలురు 
కాన్పూర్‌లో అగ్గిపెట్టెతో ఆడుకుంటూ.. నాలుగు కుక్కపిల్లలను కాల్చిన మైనర్ బాలురు

Uttar Pradesh: కాన్పూర్‌లో అగ్గిపెట్టెతో ఆడుకుంటూ.. నాలుగు కుక్కపిల్లలను కాల్చిన మైనర్ బాలురు 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 18, 2023
01:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్ కాన్పూర్‌లోని కిద్వాయ్ నగర్ ప్రాంతంలోని పార్కులో ముగ్గురు మైనర్ బాలురు నాలుగు వీధికుక్కలను కాల్చి చంపిన ఘటన కలకలం సృష్టించింది. కిద్వాయ్ నగర్‌లోని గీతాపార్క్ G బ్లాక్‌లో 8 నుంచి 10 సంవత్సరాల మధ్య వయస్సున్న చిన్నారులు ఆడుకుంటున్నారు. వారిలో ఒకరు ఇంటి నుండి అగ్గిపెట్టె తెచ్చి కుక్కపిల్లలకు నిప్పంటించాడని ఓ చిన్నారి చెప్పాడు. ఎండిన గడ్డి, జనపనార సంచితో తయారు చేసిన కుక్కపిల్లల షెల్టర్‌పై బాలుడు మండుతున్న అగ్గిపుల్లని విసిరేయడంతో, కుక్కపిల్లలు తప్పించుకునే అవకాశం లేకుండా మంటలు వ్యాపించాయి. పొగలు రావడంతో స్థానికులు నీటి బకెట్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా, అప్పటికే నాలుగు కుక్కపిల్లలు చనిపోయాయి.

Details 

నిరసన వ్యక్తం చేసిన జంతు ప్రేమికులు 

చలి పెరగడంతో స్థానికులు కుక్కపిల్లల కోసం గడ్డి,జనపనార బస్తాలతో షెల్టర్‌ను ఏర్పాటు చేసినట్లు పోలీసు ప్రతినిధి తెలిపారు. ఈరోజు, ముగ్గురు పిల్లలు ఆడుకుంటూ షెల్టర్‌కు నిప్పంటించారని, ఫలితంగా నాలుగు కుక్కపిల్లలు చనిపోయాయని ఆయన పేర్కొన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, కిద్వాయ్ నగర్‌లో ఇటీవల ఒక కుక్క నాలుగు కుక్కపిల్లలకు జన్మనిచ్చింది. ఈ సమాచారం బయటకు పొక్కడంతో జంతు ప్రేమికులు, కార్యకర్తలు సంఘటనా స్థలానికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భాద్యులపై చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ బాబూ పూర్వా అమర్‌నాథ్‌ యాదవ్‌ తెలిపారు.