Page Loader
Miss world 2025: మిస్‌ వరల్డ్‌ 2025 ఫైనల్‌ పోటీలకు కౌంట్‌డౌన్‌.. 31న జరిగే కార్యక్రమానికి హైటెక్స్‌లో ఏర్పాట్లు

Miss world 2025: మిస్‌ వరల్డ్‌ 2025 ఫైనల్‌ పోటీలకు కౌంట్‌డౌన్‌.. 31న జరిగే కార్యక్రమానికి హైటెక్స్‌లో ఏర్పాట్లు

వ్రాసిన వారు Sirish Praharaju
May 28, 2025
08:23 am

ఈ వార్తాకథనం ఏంటి

మిస్ వరల్డ్ 2025 ఫైనల్ పోటీకి సమయం దగ్గర పడుతోంది.ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకున్న 40 మంది అందాల భామలు, ప్రపంచ సుందరి కిరీటం కోసం పోటీపడేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన స్పెషల్ ఛాలెంజ్‌ల ద్వారా 14 మంది పోటీదారులు క్వార్టర్స్‌కి నేరుగా ఎంపికయ్యారు. వీరిలో స్పోర్ట్స్ ఛాలెంజ్‌ నుంచి ఒకరు,టాలెంట్ ఛాలెంజ్‌లో ఒకరు,హెడ్ టు హెడ్ రౌండ్‌లో నలుగురు,టాప్ మోడల్ విభాగంలో నలుగురు,బ్యూటీ విత్ ఏ పర్పస్ విభాగం నుంచి మరో నలుగురు విజేతలుగా నిలిచారు. మిగిలిన 26 మంది ఎంపిక ప్రక్రియ వివిధ ఖండాల ప్రాతినిధ్యం మేరకు జరగనుంది. అమెరికా-కరేబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా-ఓషియానా ఖండాలకు చెందిన పోటీదారులను న్యాయనిర్ణేతలు ఎంపిక చేయనున్నారు.

వివరాలు 

ప్రతి ఖండం నుంచి 10 మంది

ఇప్పటి వరకు ఇండోనేషియా మరియు వేల్స్‌కి చెందిన భామలు రెండు విభాగాల్లో విజేతలుగా నిలవడం విశేషం. తద్వారా ఇప్పటివరకు టాప్ 40లో 12 మంది మాత్రమే ఖరారయ్యారు. ఇంకా 28 మంది ఎంపికకు బాకీ ఉంది. ఈ టాప్ 40లో ఖచ్చితంగా ప్రతి ఖండం నుంచి 10 మందిని కలిపేలా ఎంపిక చేస్తారు. ఆ తర్వాతి దశగా వీరిలోంచి టాప్ 20 మంది సెలెక్ట్ అవుతారు,ఈ దశలో ఒక్కో ఖండం నుంచి 5 మందికి అవకాశముంటుంది. టాప్ 8 దశకు వచ్చే సమయానికి ఒక్కో ఖండం నుంచి ఇద్దరిని మాత్రమే ఎంపిక చేస్తారు. చివరగా ఒక్కో ఖండాన్ని ప్రాతినిధ్యం వహించేలా నలుగురు పోటీదారులు ఫైనల్ రౌండ్‌కి అర్హులవుతారు.

వివరాలు 

హైటెక్స్‌ వేదికగా ఫైనల్ వేడుకలు - భారీ భద్రతా ఏర్పాట్లు 

వీరిలో ఒకరు విజేతగా నిలవగా, మిగిలిన ముగ్గురు వరుసగా ఫస్ట్, సెకండ్, థర్డ్ రన్నరప్‌గా ఎంపికవుతారు. ఫైనల్ పోటీలు మే 31న హైదరాబాద్ హైటెక్స్‌లో నూతనంగా నిర్మించిన నాలుగో హాల్‌లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సైబర్ పోలీసు విభాగం, ట్రాఫిక్ శాఖ, పర్యాటక శాఖ, ఈవెంట్ నిర్వాహకులు కలిసి ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. హాల్ సామర్థ్యం దాదాపు 3,500 మంది ఉండటంతో, అంతమంది అతిథులు పాల్గొంటారని అంచనా వేసి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేయనున్నారు.ఫైనల్ ఈవెంట్ వేడుకలు సాయంత్రం నుంచే ప్రారంభమవుతాయి. ముఖ్యంగా తుది పోటీలు రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు జరుగుతాయి.