మిజోరం: రైల్వే వంతెన కూలి 17 మంది కార్మికులు మృతి
మిజోరంలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. సాయిరాంగ్ ప్రాంతానికి సమీపంలో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలిపోవడంతో కనీసం 17 మంది కార్మికులు మరణించారని పోలీసులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు. ఐజ్వాల్‌కు 21 కిమీ దూరంలో ఉదయం 10 గంటలకు ఈ సంఘటన జరిగినప్పుడు 35-40 మంది కార్మికులు పని ప్రదేశంలో ఉన్నారు. కొంతమంది శిథిలాల కింద చిక్కుపోయినట్లు పోలీసులు వెల్లడించారు. శిథిలాల నుంచి ఇప్పటివరకు పదిహేడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
కొనసాగుతున్న సహాయక చర్యలు
ప్రమాదంపై ప్రధాని మోదీ, మిజోరం సీఎం దిగ్భ్రాంతి
రైల్వే ఓవర్ బ్రిడ్జి కూలి కార్మికులు మృతి చెందడంపై మిజోరం సీఎం జోరంతంగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు నబ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రెస్క్యూ ఆపరేషన్‌లలో సహాయం చేయడానికి పెద్ద సంఖ్యలో వచ్చిన స్థానికులకు సీఎం కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రమాదంపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. మరణించిన ప్రతి ఒక్కరి కుటుంబానికి పీఎం సహాయ నిధినుంచి రూ.2లక్షల చొప్పున , గాయపడిన వారికి రూ.50,000 ఎక్స్ గ్రేషియాను ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ మేరకు పీఎంఓ ట్వీట్ చేసింది.